వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు పిల్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

0

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధంలేని సంస్థతో జరపించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను శుక్రవారం వివేకా తనయ డాక్టర్ సునీత కోరారు. ఇదిలా ఉండగా కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా జరిపించాలంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి నాలుగు రోజుల కిందట ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు దుర్గాప్రసాదరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌దారుపై న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. వ్యాజ్యం దాఖలు చేయడానికి మీకున్న అర్హతేంటో చెప్పాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది విఫలమయ్యారు. పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని ఆయన కోరారు. అనిల్ కుమార్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తుండగా జోక్యం చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతేంటని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ప్రజా సమస్యలపై పోరాడతారని, విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిపై కూడా పిల్‌ దాఖలు చేశారని తెలిపారు. అంతమాత్రాన సీబీఐ దర్యాప్తు కోరడానికి అర్హత ఉందని ఎందుకు అనుకుంటున్నారని ఈ సందర్భంగా ధర్మాసనం నిలదీసింది.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న మరో లాయర్… వివేకానందరెడ్డి హత్యపై ఆయన భార్య, కుటుంబ సభ్యులు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నారని అన్నారు. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలు చేస్తున్న ఆ వ్యాజ్యంపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తన తండ్రి హత్య కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని సంస్థతో జరపించాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా గురువారం కలిసిన డాక్టర్ సునీత వినపతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.
Please Read Disclaimer