‘సాహో’ బ్లాక్ బస్టర్.. కుల విభేదాలతో మీకు సిగ్గులేదా?: లోకేష్ ఫైరింగ్ ట్వీట్

0

లోకేష్ బాబు ఏంటి? ‘సాహో’ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అనడం ఏంటి? కొంపతీసి ఆయన రాజకీయ రంగాన్ని వదిలేసి సినిమా రంగం వైపు టర్న్ అవుతున్నారా? ప్రత్యేకించి ‘సాహో’ సినిమా గురించి ఫైరింగ్ ట్వీట్ చేయడం వెనుక థ్రిల్లింగ్ కథనమే ఉంది. ఇందులో ప్రభాస్, లోకేష్, జగన్, ఓ సినిమా వెబ్ సైట్, మరో యాంకర్ ఇలా చాలా పాత్రలే ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లిన ప్రభాస్‌కు ఏపీ రాజకీయలపై ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు యాంకర్. ఏపీ సీఎం జగన్‌ను పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారని.. ఆయన గురించి మీరు ఏం అనుకుంటున్నారంటూ.. యాంకర్ ప్రభాస్‌ని ప్రశ్నించారు. దీనికి ప్రభాస్ చాలా పాజిటివ్‌గా స్పందించారు.

‘పాలిటిక్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే యంగ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అభివృద్ధి పథంలో నడిస్తారనే నమ్మకమైతే ప్రజల్లో ఉంది. జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు’ ప్రభాస్. అయితే ఈ వార్తను మన తెలుగు మీడియా హైలైట్ చేస్తూ.. ‘ఏపీ సీఎం‌ జగన్‌పై ప్రభాస్ ప్రశంసలు.. జగన్ బెస్ట్ సీఎం అన్న ప్రభాస్’.. ఇలా రకరకాల వార్తలను వండి వార్చేశారు.

అసలే ఘోర ఓటమి నుండి కోలుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తెలుగుతమ్ముళ్లు.. జగన్ అన్నా ఆయన పాలన అన్నా అంతెత్తున లేస్తున్నారు. ఈ సందర్భంలో జగన్‌పై ప్రభాస్ ప్రశంసలు కురిపించడం వారికి చిర్రెత్తుకురావడం సహజమే.

అయితే ప్రభాస్ జగన్‌ను పొగడటంతో తెలుగు దేశం పార్టీకి ఆగ్రహం కలిగించిందని.. ‘సాహో’ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ‘సాహో’ అట్టర్ ఫ్లాప్ అంటూ కాంపెయిన్ నిర్వహిస్తున్నారంటూ ‘గ్రేట్ ఆంధ్ర’ వెబ్ సైట్‌‌లో వార్తను వండేశారు.

ఈ వార్త లోకేష్ బాబు కంటపడటంతో ఓ రేంజ్‌లో సదరు వెబ్ సైట్‌ను ఉతికి ఆరేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఘాటైన ట్వీట్ చేశారు. ‘భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ కోలాహలం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ప్రభాస్ అభిమానులతో పాటు నేనూ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘సాహో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి చెత్త కథనాన్ని పక్కనపెట్టి ‘సాహో’ చిత్రాన్ని టీడీపీ మద్దతుదారులు, ప్రభాస్ ఫ్యాన్స్ చూడాలని అభ్యర్ధిస్తున్నాను.

‘ఇలాంటి కఠోర అవాస్తవాలను రాస్తున్న గ్రేట్ ఆంధ్ర నకిలీ జర్నలిస్టులు సిగ్గుపడాలి. ఇలాంటి కుల విభేదాలను సృష్టించి సంపాదించిన డబ్బు మీకెలా మింగుడుపడుతుంది. మీకు మనసాక్షి లేదా?’ అంటూ ఘాటుగా స్పందిస్తూ సదరు వెబ్ సైట్ రాసిన వార్తని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ వార్తపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
Please Read Disclaimer