నోట్ల రద్దు తర్వాత ఏం జరిగిందో చెప్పిన ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్

0

తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యావత్ దేశానికి పెద్దనోట్ల రద్దుతో దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన మోడీ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలిసిందే. నోట్ల రద్దు వేళ.. దేశ ప్రజలు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు. ఆ సందర్భంగా జరిగిన చాలా విషయాలు బయటకురాలేదు. అప్పుడొకటి.. అప్పుడొకటి అన్నట్లుగా కొన్ని అంశాలే బయటకు వచ్చాయి. తాజాగా అలాంటి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకువచ్చింది.

ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ బీఎస్ ధనోవా చెప్పిన మాటలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయని చెప్పాలి. తాజాగా ఆయన ఐఐటీ టెక్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2016లో జరిగిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా కొత్త కరెన్సీని తరలించేందుకు వైమానిక దళాన్ని ఉపయోగించామన్నారు.

కేంద్రప్రభుత్వం కోరిన మీదట.. కొత్త కరెన్సీని దేశ వ్యాప్తంగా చేర్చామన్న ఆయన.. ఆ సమయంలో ఎయిర్ ఫోర్స్ విమానాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసిన మొత్తం 625 టన్నులుగా పేర్కొన్నారు. ఇందుకోసం ఎయిర్ ఫోర్స్ కు చెందిన 33 యుద్ధ విమానాల్ని ఉపయోగించినట్లుగా చెప్పారు.

కోటి రూపాయిల కరెన్సీ దగ్గర దగ్గర 20 కేజీలు ఉంటుందన్న ఆయన.. ఎంత విలువైన కరెన్సీ అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాము తరలించిన కరెన్సీ ఎంత విలువైనదన్న విషయం తనకు తెలీదన్నారు. రఫేల్ యుద్ధ విమానం గురించి మాట్లాడిన ఆయన.. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు వేళలో కూడా వివాదమైందన్నారు. అయితే.. అవిప్పుడు చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. అభినందన్ వర్దమాన్ కనుక రఫేల్ లో వెళ్లి ఉంటే.. పరిస్థితి మరోలా ఉంటుందన్న ఆయన.. మూడు నెలల క్రితమే పదవీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
Please Read Disclaimer