అలా కానీ చేస్తే ఫస్ట్ డోస్ తీసుకున్నా ఫలితం ఉండదు.. !

0

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభణను కొనసాగిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి కొంచెం తగ్గినట్టే కనిపించినా కూడా కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మొదటి వేవ్ సెకండ్ వేవ్ వచ్చిపోయింది. త్వరలో థర్డ్ వేవ్ వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను అన్ని దేశాలు కూడా వేగవంతం చేస్తున్నాయి. అయితే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే వ్యాక్సిన్ తగినంత దొరకడం లేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అమలాపురం నుండి అమెరికా వరకు ఇదే ధోరణి. కరోనా వైరస్పై పోరాటానికి వ్యాక్సినే బ్రహ్మాస్త్రం. ఈ విషయాన్ని ఎందరో నిపుణులు ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ వ్యాక్సిన్పై అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు.

అమెరికాలో ఫైజర్ మోడర్నా టీకాలు అందుబాటులో ఉంటే మన దేశంలో కోవిషీల్డ్ కోవాగ్జిన్ అందుబాటులో ఉన్నాయి. అయితే మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేదు. కరోనా వైరస్ రెండో డోసు ప్రాధాన్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి. చాలామంది నిపుణులు తమ అభిప్రాయాలను వివిధ వేదికలపై పంచుకున్నారు. భారత్ లో లభించే కరోనా టీకాల్లో ఒక డోసు తీసుకుంటే 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. మిగిలిన 70 శాతం మందికి అది కేవలం బూస్టర్ డోసుగానే ఉపయోగపడిందని ఐసీఎంఆర్ మాజీ చీఫ్ ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు. ఒక్కటే డోసు తీసుకుంటే మళ్లీ కోవిడ్ సోకే అవకాశాలుంటాయని ఆయన హెచ్చరించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత మన శరీరం కరోనాపై పోరాటానికి ప్రాథమికంగా సిద్ధమవుతుంది. సెకండ్ డోసు తీసుకున్నాక నిరోధకత మరింత బలోపేతమై మెమొరీ–బి కణాలు ఉత్పన్నమవుతాయి. వైరస్ వివరాలను ఈ కణాలు నమోదు చేసుకొని భవిష్యత్తులో ఇదే వైరస్ మన శరీరంపై దాడి చేస్తే వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి యుద్ధం ప్రకటిస్తాయి.

రెండో డోసు తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కరోనా వైరస్ రెండు డోసులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అమెరికాలోని యేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. మొత్తంగా 91134 మంది కరోనా రోగుల్ని డిసెంబర్–ఏప్రిల్ వరకు వారిని పరీక్షించారు. ఆ రోగుల్లో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆ కరోనా రోగుల్లో 4.5% మందిలో స్వల్పంగా యాంటీబాడీలు ఉత్పత్తయితే 25.4 శాతం మంది పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు చేరాయి. ఈ రోగుల్లో 225 మంది మరణిస్తే వారిలో వ్యాక్సిన్ తీసుకోని వారు 219 (97%) మంది కావడం గమనార్హం. మరో అయిదుగురు పాక్షికంగా నిరోధకత కలిగిన వారు కాగా మృతుల్లో కేవలం ఒకే ఒక్కరు పూర్తి స్థాయి యాంటీబాడీలు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 96% మందికి ఆస్పత్రి అవసరం రాదని ఆ అధ్యయనం తేల్చేసింది. కరోనా వైరస్ సెకండ్ డోసు తీసుకోకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముందు వెనుక ఆలోచించడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో ప్రభుత్వ వైఫల్యాలు కొన్నయితే ప్రజల్లో అవగాహనా లేమి మరి కొంత కారణమవుతోంది. టీకా కొరత మొదటి డోసు తీసుకున్న సమయంలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు రెండో డోసు తీసుకుంటే మరింత ఎక్కువ అవుతాయనే అపోహ భారత్ వంటి దేశాల్లో నిరక్షరాస్యుల్లో టీకా అంటే ఒక్కటే డోసు అన్న భావన తరతరాలుగా నెలకొని ఉండడం వంటివెన్నో సెకండ్ డోసు తీసుకోవడనికి కొంచెం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏ భయం ఆందోళన లేకుండా కరోనా రెండు డోసులు తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.