రోహిత్ శర్మ దెబ్బకి జయసూర్య 22 ఏళ్ల రికార్డ్ బ్రేక్

0

వెస్టిండీస్‌తో కటక్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. మ్యాచ్‌లో 63 బంతుల్లో 8×4, 1×6 సాయంతో 63 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఒక ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా నిలిచాడు. కటక్ వన్డేకి ముందు 2,379 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. తాజాగా 2,442 పరుగులతో నిలిచాడు. దీంతో.. సనత్ జయసూర్య 22 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డ్ కనుమరుగైంది.

శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య 1997లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 2,387 పరుగులు చేయగా.. అప్పటి నుంచి ఈ రికార్డ్‌కి ఏ క్రికెటర్ కూడా చేరువ కాలేకపోయాడు. కానీ.. ఈ ఏడాది కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేశాడు. విశాఖపట్నం వేదికగా గత బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ (159: 138 బంతుల్లో 17×4, 5×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెలిసిందే.

కటక్ వేదికగా ఆదివారం జరిగిన విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 316 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (85: 81 బంతుల్లో 9×4), ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 89 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (63: 63 బంతుల్లో 8×4, 1×6) నిలకడగా ఆడటంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
Please Read Disclaimer