టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం : సిరీస్‌ భారత్‌ కైవసం

0

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది. గతేడాది సిరీస్‌ ఓటమికి టీమిండియా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 286 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌శర్మ (119; 128 బంతుల్లో 8×4, 6×6) శతకానికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (89; 91 బంతుల్లో 8×4) అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయానికి పునాది వేశారు.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో కేఎల్‌ రాహుల్‌ (19), రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే నెమ్మదిగా ఆడుతున్న రాహుల్‌.. అగర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత కోహ్లీ, రోహిత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు స్కోర్‌ 206 పరుగుల వద్ద రోహిత్‌.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి మిచెల్‌ స్టార్క్‌ చేతికి చిక్కాడు. తర్వాత కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ (44; 35 బంతుల్లో 6×4, 1×6) ధాటిగా ఆడుతూ మ్యాచ్‌ను విజయానికి చేరువ చేశారు. ఆఖర్లో కోహ్లీ ఔటైనా మనీశ్‌ పాండే (8; 4 బంతుల్లో 2×4) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్‌స్మిత్‌ (131; 132 బంతుల్లో 14×4, 1×6), మార్నస్‌ లబుషేన్‌ (54; 64 బంతుల్లో 5×4) రాణించడంతో ఆ జట్టు టీమిండియా ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (3), ఆరోన్‌ఫించ్‌ (19) త్వరగా ఔటైనా.. స్మిత్‌, లబుషేన్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో లబుషేన్‌ వన్డేల్లో తొలి అర్ధ శతకం సాధించాక జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్‌లో మిచెల్‌ స్టార్క్‌ (0) సైతం భారీ షాట్‌కు యత్నించి చాహల్‌ చేతికి చిక్కాడు. తర్వాత ఆలెక్స్‌కారే (35; 36 బంతుల్లో 6×4), స్టీవ్‌స్మిత్‌ ధాటిగా ఆడి మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి వరుసగా వికెట్లు తీశారు. షమి వేసిన 48వ ఓవర్‌ తొలి బంతికి స్మిత్‌ భారీ షాట్‌ ఆడి శ్రేయస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. తర్వాత ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో షమి నాలుగు, జడేజా రెండు వికెట్లు తీశారు. నవ్‌దీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

కోహ్లీ చెప్పినట్లుగానే..

ఇదిలా ఉండగా ఈ సిరీస్‌లో ముంబయిలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘోర పరాభవం చెందిన విషయం తెలిసిందే. భారత్‌ అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ శతకాలతో చెలరేగి భారత్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఒక్క మ్యాచ్‌కే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అన్నట్లుగానే రెండో వన్డేలో అద్భుతంగా రాణించి 340 పరుగుల భారీ స్కోర్‌ చేశారు. అనంతరం ఆసీస్‌ను 304 పరుగులకే కట్టడి చేసి సమష్టి విజయం సాధించారు. ఇక బెంగళూరులో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో మరోసారి అన్ని విభాగాల్లో రాణించడమే కాకుండా సిరీస్‌ సొంతం చేసుకుంది టీమిండియా. దీంతో గతేడాది ఆసీస్‌ భారత పర్యటన సందర్భంగా 3-2 సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
Please Read Disclaimer