ఆరోపణల కలకలం..ఇన్ ఫీకి స్టాక్ మార్కెట్ షాక్

0

సంస్థ ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు షేర్ మార్కెట్లో ఊహించని షాక్ తగిలింది. సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ – సీఎఫ్ వో నిలంజన్ రాయ్ లు అనైతిక విధానాలను అవలంభిస్తున్నారని ఉద్యోగులే చెబుతున్నారని పేర్కొంటూ..కొందరు గుర్తుతెలియని సిబ్బంది ఇన్ఫోసిస్ బోర్డుకు లేఖ రాసిన ఉదంతం కంపెనీ షేర్లను తీవ్రంగా ఒడిదుడుకుల పాలు చేసింది. ఇవాళ ఒక్క రోజే ఆ కపెంనీ షేర్లు 16 శాతం పతనమయ్యాయి. గత ఆరేళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఉద్యోగుల లేఖ ఎంతమేరకు ప్రభావం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

విజిల్ బ్లోయర్లుగా పేర్కొంటూ పలువురు ఉద్యోగులు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు గత నెల 20న రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. భారీ ఒప్పందాల్లో నిబంధనల అతిక్రమణ జరిగిందని – సమీక్షలు – అనుమతులు – సూచనలు చేయకుండానే పెద్దపెద్ద డీల్స్కు పరేఖ్ పచ్చజెండా ఊపారని ఉద్యోగులు వెల్లడించారు. ఆడిటర్లు – బోర్డు నుంచి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని – వెరిజోన్ – ఇంటెల్ ఒప్పందాలతో పాటు జపాన్ లో జాయింట్ వెంచర్లు – ఏబీఎన్ ఆమ్రో కొనుగోలు లావాదేవీలేవీ సక్రమంగా జరుగలేదని – అకౌంటింగ్ ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో కుదిరిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాల నుంచి సంస్థకు నయాపైసా లాభం లేదని – ఈ వాస్తవాలను దాచిపెట్టారని ఉద్యోగులు ఈ లేఖలో బయటపెట్టారు.

ఈ లేఖ వెలుగులోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ షేర్లు పడిపోవడం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయంలో ఇన్ఫోసిస్ షేరు ధర 15 శాతం క్షీణతతో రూ.659 వద్ద ఉంది. ఒకే రోజు స్టాక్ ధర ఏకంగా ఇంట్రాడేలో 16 శాతం మేర పతనమైంది.దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.43925 కోట్లు హరించుకుపోయింది. ఇదిలాఉండగాఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని స్పందించారు. ఫరేక్ పై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు కంపెనీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. గుర్తు తెలియని ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును కంపెనీ ఆడిట్ కమిటీ ముందు పెట్టినట్లు ఆయన చెప్పారు.
Please Read Disclaimer