హెలికాప్టర్‌తో ‘ఇన్ టు ది వైల్డ్’ బస్సు తరలింపు.. దీని చరిత్ర ఓ విషాదం

0

బస్సు 142.. అమెరికాలో ఈ బస్సు గురించి తెలియని వ్యక్తులుండరు. అలాగే, హాలీవుడ్ సినిమాలను ఇష్టపడేవారికి కూడా ఈ బస్సు సుపరిచితమే. ఎందుకంటే.. ఈ బస్సు నేపథ్యంతో ‘ఇన్ టు ది వైల్డ్’ అనే సినిమా వచ్చింది. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మాంచి హిట్ సాధించడమే కాదు.. సాహస యాత్రలను ఇష్టపడేవారికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే, సాహసికులకు ఇకపై ఆ బస్సు కనిపించదు. ఎందుకంటే.. ప్రభుత్వం దాన్ని అక్కడి నుంచి తరలించింది. దీన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందో తెలుసుకొనే ముందు తప్పకుండా ఈ బస్సు వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవల్సిందే.

మెక్‌కాండ్లెస్ అనే 24 ఏళ్ల యువకుడు నగర జీవితాన్ని వదిలి ప్రకృతితో మమేకమై.. ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకుంటాడు. ఈ సందర్భంగా అమెరికాలోని దట్టమైన అడవుల్లోకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాడు. టెక్లానికా నదిని దాటి అవతలికి ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ అతడికి 1940 నాటి ఫెయిర్‌బ్యాంక్స్‌ సిటీకి చెందిన బస్సు కనిపిస్తుంది. ఖాళీగా ఉన్న ఆ పురాతన బస్సు అతడికి బాగా నచ్చేస్తుంది. దీంతో ఆ బస్సునే ఆవాసంగా చేసుకుని మెక్‌కాండ్లెస్ జీవిస్తాడు.

1992 సంవత్సరంలో ఓ రోజు మెక్‌కాండ్లెస్ తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, అప్పటికే టెక్లానికా నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మళ్లీ బస్సులోకి వెళ్లిపోతాడు. అందులోనే 113 రోజులు జీవించిన తర్వాత చనిపోతాడు. ఆకలితో అడవిలో దొరికిన విషపూరిత పండ్లను తినడం వల్ల అతడు చనిపోయాడని తెలిసింది.

మెక్‌కాండ్లెస్ తన జర్నీకి సంబంధించిన ప్రతి విషయాన్ని పుస్తకంలో రాసుకున్నాడు. ఫోటోలు కూడా తీసుకున్నాడు. అతడు పుస్తకంలో పేర్కొన్న అనుభవాల ఆధారంగా జాన్‌ క్రాకోర్‌ 1996లో ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ అనే రచించాడు. ఈ కథతోనే 2007లో సినిమాను తెరకెక్కించారు. అప్పటి నుంచి ఈ బస్సుకు అభిమానులు పెరిగిపోయారు. దానికి అంతా ‘

మ్యాజిక్ బస్’ అని పేరు పెట్టారు.

అయితే, ఈ బస్సు వద్దకు వెళ్లడం చాలా కష్టం. దట్టమైన అడవి, కొండలు కోనలు దాటుకుంటూ అక్కడికి చేరుకోవాలి. ఈ క్రమంలో చాలామంది సాహసికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందరో గాయాలపాలైనారు. దీంతో అలస్కా ఆర్మీ నేషనల్‌ గార్డ్‌, అలస్కాలోని సహజ వనరుల విభాగం కలిసి.. హెలికాప్టర్ సాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు.


1961లో జరిగిన రోడ్డు నిర్మాణ పనుల్లో కార్మికులు ఆ బస్సును అక్కడికి తీసుకొచ్చారని, అది మొరాయించడంతో అడవిలోనే వదిలి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఈ బస్సును చూసేందుకు పర్యాటకులు సాహస యాత్రలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అందుకే బస్సును అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందన్నారు. బస్సును హెలికాప్టర్‌లో తరలిస్తున్న వీడియోను ఈ కింది ట్వీట్‌లో చూడండి.

 
Please Read Disclaimer