ధోనీ మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడు..!: మైకేల్ హస్సీ

0

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ జోస్యం చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తర్వాత గత 11 నెలలుగా కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ నిరవధికంగా వాయిదాపడింది. దాంతో.. ధోనీ కెరీర్ ప్రశ్నార్థంకలో పడిపోగా.. అతని కెరీర్ ఇప్పటికే ముగిసిపోయిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

ధోనీ భవితవ్యం గురించి తాజాగా మైకేల్ హస్సీ మాట్లాడుతూ ‘‘మహేంద్రసింగ్ ధోనీ ఎవరి అంచనాలకి అందని వ్యక్తి.. అలానే నమ్మశక్యంగాని ఆటగాడు. టీమిండియా తరఫునే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా సుదీర్ఘకాలంగా అతను నిలకడగా ఆడుతున్నాడు. నా అంచనా ప్రకారం మెరుగైన ఫిట్‌నెస్ ఉన్న అతను మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడు. కానీ.. మనం చూడగలుగుతామా..? అనేది నా సందేహం’’ అని వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఓటమికి ధోనీ రనౌట్ కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోనే మైకేల్ హస్సీ సుదీర్ఘకాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. 2015లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించిన హస్సీ.. ఆ తర్వాత చెన్నై జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఇక ధోనీ ఈ నెల 7న 39వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు.
Please Read Disclaimer