విమానం కూల్చి క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్

0

ఉక్రెయిన్ విమానాన్ని కూల్చి 180మంది మరణానికి కారణమైన ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ తీవ్ర విచారం ఆవేదన వ్యక్తం చేశారు. తమ వల్ల క్షమించరాని తప్పిదం జరిగిందని వాపోయారు. మా సైన్యం చేసిన మానవ తప్పిదం వల్ల 180మంది చనిపోయారని.. దీనికి తాము ఎంతగానో చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ ట్విట్టర్ లో స్పందించారు. మానవ తప్పిదంతో క్షిపణులను ప్రయోగించడం వల్ల దురదృష్టవశాత్తూ ఉక్రెయిన్ విమానం కూలి అంత మంది చనిపోయారని తెలిపారు. తమ సాయుధ బలగాలు వల్ల జరిగిన ఈ తప్పు క్షమించరానిది అని వాపోయారు. తమ వల్ల 180మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతకుముందు ఇరాన్ చేసిన విచారణలో ఇది తమ క్షిపణుల వల్లే కూలిందని తేలింది. సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోలేదని.. ఇరాన్ క్షిపణులే ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేశాయని తాజాగా ఇరాన్ బాంబు పేల్చింది. దీంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకున్నట్టు లైవ్ వీడియోలో కనిపించినా ఇన్నాళ్లు ఇరాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. తాజాగా తామే కూల్చామని చెప్పడంతో ఇంత పాపం చేసింది ఎవరో తేలిపోయింది. ఇరాన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి.
Please Read Disclaimer