సులేమానీని అమెరికా ఎలా లేపేసిందంటే?

0

ఇరాన్ చీఫ్ ఖాసిం సులేమానీ మామూలోడు కాదు. అతన్ని టచ్ చేయటం అంత సింఫుల్ కాదు. మూడు రోజుల క్రితం బ్రేకింగ్ న్యూస్ లో సులేమానీని లేపేసినట్లు వార్తలు వచ్చినప్పుడు ఆయన పవర్ గురించి తెలిసినోళ్లు షాక్ తింటే.. తెలీనోళ్లు చాలా లైట్ తీసుకున్నారు. అయితే.. లాడెన్ ను లేపేసే టైంలో అమెరికా ఎలా అయితే పక్కా ప్లాన్ వేసిందో.. సులేమానీని లేపేసే ఆపరేషన్ ను అంతకు మించిన గుట్టును ప్రదర్శించింది. ఒక దేశ సైనిక జనరల్.. దేశాధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని అగ్రరాజ్యం లేపేయాలన్న ప్లాన్ మామూలు కాదు కదా?

ప్రపంచంలో ఏ దేశంలో అయినా.. తాము అనుకున్నది చేస్తామన్న విషయాన్ని తాజా ఎపిసోడ్ లో అగ్రరాజ్యం చెప్పకనే చెప్పేసింది. తాను టార్గెట్ చేయాలే కానీ.. ఎవరికైనా ఉగ్ర మరకను అంటించేయటం.. ప్రపంచానికి ప్రమాదకారి అన్నట్యాగ్ తగిలించి.. తాను అనుకున్నట్లుగా లేపేసే కండబలాన్ని అమెరికా మరోసారి ప్రదర్శించిందని చెప్పాలి. ఇంతకీ ఖాసిం సులేమానీని లేపేయటం కోసం చాలానే కసరత్తు జరిగింది. ఈ రహస్య ఆపరేషన్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా తక్కువ మందికి మాత్రమే సమాచారం అందించారు. ఇంకా చెప్పాలంటే.. ఆయన కనుసన్నల్లోనే జరిగింది.

అమెరికాకు ప్రమాదకరమైన సందర్భంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ అయినా అమలు చేయొచ్చన్న అవకాశాన్ని తనకు అనువుగా మార్చేసుకున్న ట్రంప్.. చివరకు అమెరికాకు అత్యంత సన్నిహిత.. మిత్ర దేశమైన బ్రిటన్ లాంటి దేశాలకు సులేమానీ లేపేసే సమాచారాన్ని ఇవ్వలేదు. ఇక.. సులేమానీ హతమార్చే ఎపిసోడ్ ను జాగ్రత్తగా చూస్తే.. మితిమీరిన ఆత్మవిశ్వాసం.. తనను టచ్ చేయటానికి ఎవరూ సాహసించరన్న ఆలోచన సులేమానీకి ఉన్నట్లుగా అనిపించక మానదు. ఇదే ఆయన ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.

రక్షణ చర్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆయన తీరే.. ప్రాణాలు పోవటానికి కారణమైందని విశ్లేషించే వారు లేకపోలేదు. అమెరికా దౌత్య కార్యాలయం మీద జరిగిన దాడి వెనుక సులేమానీ ఉన్నట్లుగా అమెరికా భావించిందో.. ఇక అతడ్ని ఉపేక్షించకూడదని డిసైడ్ అయ్యింది. ఇరాన్ తో పాటు ఇరాక్.. లెబనాన్.. సిరియాలలో స్వేచ్ఛగా తిరిగే సులేమానీ కోసం అమెరికా కొద్దికాలంగా గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఆయన్ను లేపేసే ప్లాన్ ఎలా అమలు చేశారన్న దానిపై న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అది అందించిన సమాచారం ప్రకారం చూస్తే.. అమెరికా ఎంత పకడ్బందీ ప్లాన్ అమలు చేసిందో ఇట్టే అర్థమైపోతుంది.

తనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించిన అమెరికా.. సులేమానీ బాగ్దాద్ వస్తున్నట్లుగా గుర్తిచింది. అతను ఎప్పుడు వస్తాడు? ఎక్కడకు వస్తాడు? ఏ వాహనాల్లో బయలుదేరతారన్న సమాచారం అమెరికా వద్ద ఉన్నట్లుగా చెప్పాలి. దీన్ని చూస్తే అమెరికా గూఢచర్యం ఎంత లోతుగా.. బలంగా ఉందో అర్థమవుతుంది. బాగ్దాద్ కు వస్తున్న సులేమానీ గురించి తెలుసుకున్న అమెరికా.. ఆయన్ను హతమార్చటం కోసం ఏమేం చేయాలన్న దానిపైన పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు హంటర్ కిల్లర్ ను బయటకు తీసింది. తాజా ఆపరేషన్ లో ఇలాంటివి రెండు లేదంటే మూడింటిని రంగంలోకి దించి ఉంటారని భావిస్తున్నారు.

ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏమంటే.. గంటకు 480కి.మీ. వేగంతో ప్రయాణించటమే కాదు.. దాదాపు 1800 కి.మీ. ఏకధాటిగా ప్రయాణించేసత్తా ఉంది. వీటికున్న మరో ప్రత్యేకత పెద్దగా శబ్ధం చేయకుండా టార్గెట్ వద్దకు చేరుకోవటం. ఇవన్నీ చూసినప్పుడు అమెరికా ప్రయోగించిన డ్రోన్లను కువైట్ నుంచి కానీ ఖతార్.. యూఏఈలో ఏదో ఒక చోట నుంచి పంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ డ్రోన్లకు 17.2 కేజీల బరువున్న లేజర్ గైడెడ్ హెల్ ఫైర్ నింజా క్షిపణుల్ని అమర్చారు. వీటి పవర్ ఎంతంటే.. ఒకయుద్ధ ట్యాంకును సైతం ముక్కలు ముక్కలు చేసే శక్తి వాటి సొంతం.

ఈ క్షిపణి ప్రత్యేకత ఏమంటే.. టార్గెట్ ను మాత్రమే టచ్ చేయటం ఒకటైతే.. పేలుడు తర్వాత చుట్టుపక్కల డ్యామేజీ వీలైనంత తక్కువగా ఉండేలా చేయటం దీనికున్న మరో ప్రత్యేకత. దీన్ని బట్టి చూస్తే సులేమానీ కారులో ఎక్కడ కూర్చునేదన్న విషయం మీద కూడా అమెరికా నిఘా వ్యవస్థ సేకరించి ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినంతనే.. ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏమంటే.. దాని ఉనికిని ఎవరూ గుర్తించలేరు.

శుక్రవారం తెల్లవారుజామున సులేమానీ మరికొందరు ముఖ్యలతో కలిసి బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆయన సిరియా(?) వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు స్వాగతం పలికేందుకు పాపులర్ మొబలైజేషన్ ఫోర్స్ నేత అబు అల్ ముహందీస్ టీం రెండు టయోటా ఎస్ వీయూలలో వచ్చారు. సులేమానీని అందులో ఎక్కిన వెంటనే.. అప్పటిదాకా కాచుకొని కూర్చున్న డ్రోన్లు నిప్పులు చెరిగాయి. సులేమానీ కూర్చున్న వాహనంతో పాటు.. ముందున్న వాహనం మీదా క్షిపణిని ప్రదర్శించారు. దీంతో.. భారీ పేలుడు చోటు చేసుకుంది. అంత పెద్ద కార్లు తునాతునకలు కావటమే కాదు.. కార్ల ఛాసీస్ లు మెలి తిరిగిపోతే.. భద్రతా సిబ్బంది తుపాకులు కరిగిపోయాయి. అంత తీవ్రమైన దాడి తర్వాత విజయగర్వంతో డ్రోన్లు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. అగ్రరాజ్యం పవర్ తెలిపే ఆపరేషన్ గా దీన్ని చెప్పాలి.
Please Read Disclaimer