అమెరికాకు ఇరాన్ షాక్ మామూలుగా లేదుగా!

0

నిన్నటిదాకా శాంతం గానే కనిపించిన ప్రపంచ దేశాల మధ్య ఉన్నట్టుండి అగ్గి రాజుకున్నట్లుగానే చెప్పాలి. అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతూ చిన్న దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు చెందిన 17 మంది అధికారులను అదుపులోకి తీసుకున్న ఇరాన్… వారిలో పలువురికి ఉరిశిక్ష కూడా విధించినట్లుగా వస్తున్న వార్తలు నిజంగానే కలకలం రేపుతోంది. ఇప్పటికే ఉత్తర కొరియా రూపంలో ఓ చిన్న దేశం తనకే సవాల్ విసురుతుంటే… నానా తంటాలు పడుతున్న అమెరికాకు ఇరాన్ తీసుకున్న ఈ చర్య నిజంగానే అశనిపాతంగానే మారిందని కూడా చెప్పక తప్పదు.

అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే… గత కొంతకాలంగా అమెరికా – ఇరాన్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచ్చన్న యుద్ధానికి మరింతగా నిప్పు రాజేస్తూ ఇరాన్ తన భూభాగంలో ఉన్న 17 మంది సీఐఏ అధికారులను అరెస్ట్ చేసింది. అంతటితో ఆగని ఇరాన్… ఆ 17 మందిలో పలువురికి ఉరిశిక్షలు కూడా అమలు చేసిందట. అయితే ఈ విషయంపై పెద్దగా స్పష్టత లేకున్నా… ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాల నేపథ్యంలో ఈ వార్త అసత్యమేమీ కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో అమెరికా – ఇరాన్ ల మధ్య యుద్ద మేఘాలు కూడా అలముకున్నాయన్న వార్తలూ ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ వార్త నిజమేనన్నట్లుగా ఇరాన్ ఓ కీలక ప్రకటన చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమ భూభాగంలోకి చొరబడటమే కాకుండా తమ దేశానికి చెందిన కీలక రంగాలైన ఆర్థిక – అణు – మిలిటరీ – సైబర్ రంగాల్లో సీఐఏ ఏజెంట్లు విధులు నిర్వర్తిస్తూ తమ దేశ సమాచారాన్ని సేకరిస్తున్నారని – అందుకే వారిని అరెస్ట్ చేసినట్టుగా ఇరాన్ ప్రకటించినట్టుగా ఆ దేశానికి చెందిన పలు మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఇదిలా ఉంటే… పాశ్చాత్య దేశాలతో ఇరాన్ కొరకరాని కొయ్యగానే మారిపోయిందని చెప్పాలి. ఆ క్రమంలోనే బ్రిటన్ కు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ ను గత వారం సముద్ర జలాలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఇరాన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గతవారం బ్రిటన్ ట్యాంకర్ ను పట్టేసిన ఇరాన్…. తాజాగా ఏకంగా అమెరికానే టార్గెట్ చేస్తూ ఆ దేశ గూఢచార సంస్థ సీఐఏకు చెందిన అధికారులను అరెస్ట్ చేసిందని – వారిలో పలువురికి ఉరి శిక్షలు కూడా విధించిందన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.
Please Read Disclaimer