ఏపీకి నూతన గవర్నర్.. నరసింహన్ పరిస్థితి ఏంటి?

0

ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ రాక ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి ఏపీకి నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీ తివారీ వివాదంలో చిక్కుకుని ఏపీ నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి నరసింహనే గవర్నర్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఆ తర్వాత అనేక పరిణామాలు సంభించినా రాష్ట్ర విభజన జరిగినా నరసింహన్ మాత్రం గవర్నర్ గా కొనసాగుతూ వస్తున్నారు.

రెండో సారి ఎన్డీయే సర్కారు ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు పలు మార్పలును చేపడుతున్నారట కమలనాథులు. అందులో భాగంగా ఏపీకి గవర్నర్ మార్పు గురించి కసరత్తు మొదలుపెట్టారట. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఏపీకి నూతన గవర్నర్ గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వయసు మీద పడటంతో ఈ సారి సుష్మా స్వరాజ్ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. ఆమె సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆమెకు గవర్నర్ పదవిని కేటాయిస్తూ ఉన్నారట కమలనాథులు. ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించనున్నారట.

ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా సమాచారం వచ్చిందని భోగట్టా. అలాగే ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్ కు కూడా ఈ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

అయితే ఇంతకీ నరసింహన్ తదుపరి పరిస్థితి ఏమిటనేది ఆసక్తిదాయకంగానే మిగిలింది. నరసింహన్ ను కనీసం తెలంగాణకు అయినా గవర్నర్ గా కొనసాగిస్తారా? లేక తెలంగాణకూ వేరే కొత్త గవర్నర్ వస్తారా? లేక సుష్మకే తెలంగాణ బాధ్యతలు అప్పగించి నరసింహన్ ను పూర్తిగా పక్కన పెడతారా? అనేవి ప్రస్తుతానికి శేష ప్రశ్నలే.

ఈ అంశాల గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సుష్మా స్వరాజ్ ఏపీకి గవర్నర్ రావడంతో జగన్ కు సానుకూలంగానే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు.
Please Read Disclaimer