జనసేనలో చివరకు మిగిలేది ఎవరు?

0

జనసేన పార్టీలో ఎవరు మిగులుతారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు ఉత్సాహంగా ఈ పార్టీలోకి కొందరైనా చేరారు. అక్కడకూ పెద్ద పెద్ద కాపు లీడర్లు అంతా ఈ పార్టీలోకి చేరతారు అనే అంచనాలు ఉండేవి. అయితే చివరకు జనసేన లోకి ఎన్నికల ముందు చేరింది కూడా చాలా మంది రాజకీయ నిరుద్యోగులే. పవన్ కల్యాణ్ మాటలకూ.. జనసేన బలగానికి ఏ మాత్రం సంబంధం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలోనే అలాంటి పరిస్థితి కనిపించింది.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అటు కాంగ్రెస్ నుంచి – మరోవైపు తెలుగుదేశం నుంచి అనేక మంది వచ్చి చేరారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కాపు రాజకీయ నేతల్లో కూడా ఎవరిలోనూ నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ఇక ఎన్నికల్లో సాధించిన ఫలితాలు ఏ స్థాయివో చెప్పనక్కర్లేదు.

స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన తురుపుముక్కలుగా ప్రచారం పొందిన వీ లక్ష్మినారాయణ – నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ల పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. కనీసం ఉనికి చాటలేకపోయింది జనసేన.

ఇక పవన్ కల్యాణ్ తీరులో ఎన్నికల తర్వాత కూడా పెద్ద మార్పు లేదు. చంద్రబాబు నాయుడు లాగే మాట్లాడుతూ ఉన్నారు. జగన్ ను విమర్శించడమే తప్ప పవన్ రాజకీయంలోమరో అజెండా లేదని స్పష్టం అయ్యింది. ‘ఎలా ముఖ్యమంత్రి అవుతావో చూస్తా జగన్..’ అంటూ సవాల్ విసిరే వారు ఎవరైనా ఉంటారా? ప్రజల అనుకుంటే ఎవరైనా సీఎం అవుతారు. అంతే కానీ.. తనబోటి వాళ్లు అనుకుంటే ఏమీ కాదని పవన్ కు ఈ పాటికే అర్థం అయి ఉండాలి. అయినా ఆయన తీరులో మార్పేమీ లేదు.

ఈ నేపథ్యంలో.. నేతలు ఒక్కొక్కరుగా జనసేన నుంచి బయటకు వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీలోకి చేరిందే తక్కువ మంది. ఇప్పుడు అలాంటి వాళ్లు కూడా తలోదిక్కుకుపోతున్నారు. ఈ నేఫథ్యంలో త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి నేఫథ్యంలో జనసేనలో మిగిలేది ఎంతమంది? అనేది చర్చనీయాంశంగా మారింది!
Please Read Disclaimer