కాళేశ్వరం వల్ల ఎంత నష్టమొచ్చిందో చెప్పిన కాంగ్రెస్ సీనియర్

0

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆరెస్ ప్రభుత్వం దాన్ని తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా బాగా మార్కెట్ చేసుకుంటోంది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ కరవు తీరుతుందని.. తెలంగాణ అన్నపూర్ణ అవుతుందని చెబుతుంది. ఈ క్రమంలో ఏపీలోని కొత్త ప్రభుత్వాన్నీ దీనికి సానుకూలంగా మార్చుకోగలిగింది. అయితే.. సొంత రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ లో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికీ సానుకూలత తేలేకపోతోంది.

తాజాగా మాజీ మంత్రి – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.40 వేల కోట్ల భారం పడిందని లెక్కలు చెబుతున్నారు. అందుకు ఆయన కారణాలు చెబుతున్నారు. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించకపోవడం వల్ల రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనవు భారం పడడమొక్కటే కాదు.. నీటి ఎత్తిపోతలలో విలువైన 15 రోజుల సమయం కూడా కోల్పోయామని ఆయన ఆరోపిస్తున్నారు.

తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించి ఉంటే ఇప్పటికే సుందిళ్లకు నీటిని తరలించే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. మేడిగడ్డ – అన్నారం ఎత్తిపోతలతో అదనపు భారంతో పాటు అత్యంత కీలకమైన సమయం కూడా వృథా అయిందని.. సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంపై రూ.40 వేల కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడిందని అన్నారు. ఇప్పటికైనా సీఎం తన ఆలోచన మార్చుకొని తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు.

తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట కడితే గురుత్వాకర్షణ కారణంగా సహజ పద్దతిలోనే కాలువ ద్వారా సుందిళ్ళకు నీరొస్తుందని ఆయన అన్నారు. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మిస్తే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందన్న ఆయన.. కేసీఆర్ మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మీడియా సంపాదకులు – ప్రతినిధులను తీసుకెళ్తోన్న కేసీఆర్.. వారిని తమ్మిడిహట్టి వద్దకు కూడా తీసుకెళ్ళాలని జీవన్ రెడ్డి కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వారిని తమ్మిడిహట్టికి తీసుకెళ్తామని చెప్పారు.

కాగా… తెలంగాణలోని జర్నలిస్టులను – దిల్లీ మీడియాను గతంలోనే అప్పటి తెలంగాణ ఇరిగేషన్ మినిష్టర్ హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకెళ్లగా ఇప్పుడు కేసీఆర్ మరోసారి దిల్లీలోని నేషనల్ మీడియా ఎడిటర్లను హెలికాప్టర్లలో.. ఇతర దిల్లీ జర్నలిస్టులను బస్సుల్లో కాళేశ్వరం తీసుకెళ్లడానికి సమీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి చేసిన రూ.40 వేల కోట్ల అదనపు భారం ఆరోపణలు సంచలనంగా మారాయి.
Please Read Disclaimer