విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమి!

0

కర్ణాటకలో కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలింది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపించిన కర్ణాటక రాజకీయానికి తెరపడింది. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది.

కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. అధికార కూటమికి చెందిన 15మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న కర్ణాటకీయం ముగిసింది.

సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా ఒక్కో సభ్యుడ్ని లెక్కించారు. ఈ విశ్వాస పరీక్షలో అధికార కూటమి వైపు 99 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష కూటమికి 105 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 103ను అందుకోలేకపోవడంతో జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.
Please Read Disclaimer