ఎంట్రీలోనే తమిళిసైకు తానేంటో చెప్పేసిన కేసీఆర్

0

ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా పదవిని చేపట్టిన నరసింహన్ కు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఇద్దరు ప్రముఖులు భేటీ అయ్యింది కూడా లేదు. అలాంటిది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నరసింహన్ కు.. కేసీఆర్ కు మధ్యనున్న అనుబంధం ఎంతలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో గవర్నర్ కు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు కేసీఆర్. తక్కువలో తక్కువ ప్రతి రెండు వారాలకు రాజ్ భవన్ వెళ్లిన కేసీఆర్.. గంటల తరబడి గవర్నర్ తో భేటీ వైనం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద అదే పనిగా గవర్నర్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపిన తీరుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించేవి.

ఒకదశలో కేంద్రం..తెలంగాణ రాష్ట్రం మధ్య సంధానకర్తగా నరసింహన్ వ్యవహరించారని చెబుతారు. కేంద్రం నుంచి వచ్చే సంకేతాల్ని.. సందేశాల్ని తనదైన రీతిలో కేసీఆర్ కు అందించటంతో పాటు.. కేంద్రం గుస్సా కాకుండా కేసీఆర్ వ్యవహరించేలా చేశారని చెప్పాలి. కేసీఆర్ తో ఇంతటి అనుబంధం ఉన్న నరసింహన్ ను.. తెలంగాణ రాష్ట్రంలో ఉంచేందుకు వీలుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు పదవిని కూడా ఇస్తానని ఆఫర్ చేసినట్లుగా చెబుతారు. కానీ.. అలాంటి పదవుల్ని తాను చేపట్టనని సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతారు. ఈ విషయంలో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. వెళుతూ వెళుతూ కూడా తన మిత్రుడికి అవసరమైన పనుల్ని నరసింహన్ పూర్తి చేశారన్న మాట వినిపిస్తోంది.

అదెలానంటే..మంత్రివర్గ విస్తరణ ప్రభుత్వ కార్యక్రమే అయినా.. దాన్ని నిర్వహించేది మాత్రం గవర్నరే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మంత్రివర్గ విస్తరణ అంశాన్ని గవర్నర్ ముందుకు తీసుకొచ్చి.. ఆ తర్వాత ప్రమాణస్వీకారోత్సవానికి టైం డిసైడ్ చేస్తారు. ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అనుమతితో పాటు.. ఆదేశాలు ముఖ్యమే. గవర్నర్ గా తన చివరి రోజుకు ముందే.. మంత్రివర్గ విస్తరణకు అవసరమైన అన్ని ఆదేశాల్ని నరసింహన్ పూర్తి చేశారని చెబుతున్నారు. ఎందుకంటే..నరసింహన్ స్థానంలో వస్తున్న తమిళిసై గవర్నర్ పగ్గాలు చేపట్టిన ఐదు గంటల వ్యవధిలోనే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉండటం గమనార్హం.

తాను నివాసం ఉండే రాజ్ భవన్ ను సరిగా చూసుకునే అవకాశం లేకుండానే.. వెనువెంటనే ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కొత్త గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే మంత్రివర్గ విస్తరణ అంటే.. అప్పటికప్పుడు ఏర్పాట్లు సాధ్యం కావు. ముందస్తుగా ప్లాన్ చేస్తే తప్పించి ఇవేమీ చేయలేరు. మరిలా చేస్తున్నారంటే.. ఎంత ముందుగా ప్లానింగ్ ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. తాజా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అన్ని అనుమతులు.. ఆదేశాలు వెళ్లిపోయిన గవర్నర్ నరసింహన్ ఇచ్చారని అర్థమవుతుంది.

కేసీఆర్ కు చెక్ చెప్పేందుకే తమిళిసై నియామకం సాగిందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతకు మించి విస్తరణ ప్లాన్ చేశారని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ఇవాల్టి మినహా మరే రోజు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టినా.. గవర్నర్ స్థానంలో ఉన్న తమిళిసై అంగీకారం.. ఆదేశాలు అవసరం. ఇలాంటివేమీ లేకుండా ఆమెకు సంబంధం లేని రీతిలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా.. ప్లానింగ్ లోనూ.. వ్యూహాత్మక ఎత్తుగడలు వేయటంలోనూ తానేమీ తక్కువ తినలేదన్న సంకేతాల్ని తాజా నిర్ణయంతో తీసుకున్నారని చెబుతున్నారు. ఒకవిధంగా విస్తరణ అంశం కొత్తగా వస్తున్న గవర్నర్ కు ఒకింత షాక్ లాంటిదేనన్న మాట వినిపిస్తోంది. ఈ అంచనాలు రానున్న రోజుల్లో ఇరువురు ప్రముఖుల మధ్య ఎలాంటి వాతావరణం ఉండేలా చేస్తాయో చూడాలి.
Please Read Disclaimer