బైపోల్స్ క్యాంపెయిన్ లోకి కేసీఆర్..అనివార్యమే మరి!

0

తెలంగాణలో ఇప్పుడు రెండు విషయాలు ప్రదానంగా చర్చకు వస్తున్నాయి. ఒకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె కాగా… రెండోది హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక. మిగిలిన పార్టీలకు ఈ రెండూ వేర్వేరు అంశాలే అయినా… అధికార టీఆర్ ఎస్ కు మాత్రం ఈ రెండూ కూడా విడదీయలేని సమస్యలుగా మారిపోయాయని చెప్పక తప్పదు. హుజూర్ నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి టీఆర్ ఎస్ పరిస్థితి బాగానే ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె మొదలైపోవడం – దానిపై కేసీఆర్ తనదైన మార్కు ఉక్కుపాదాన్ని మోపడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. మొన్నటిదాకా ఎలాగైనా గెలిచేస్తామని ధీమా టీఆర్ ఎస్ నేతల్లో వ్యక్తం కాగా… ఇప్పుడు గెలుపు కోసం రాత్రింబవళ్లు శ్రమించినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదన్న భావన వచ్చేసింది. అందుకే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో హుజూర్ నగర్ బైపోల్ క్యాంపెయిన్ బరిలోకి స్వయంగా కేసీఆరే దిగక తప్పడం లేదు.

ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 19న ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో అక్టోబర్ 17నే టీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభలో కేసీఆర్ తనదైన మార్కు ప్రసంగంతో ఓటర్లను ఏ మేర ప్రభావితం చేస్తారో తెలియదు గానీ… ఒక్క నియోజకవర్గం – అది కూడా ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గంలో గెలుపు కోసం స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగుతున్న వైనంపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా కేసీఆర్ హుజూర్ నగర్ బైపోల్స్ పై వ్యూహాలు మాత్రమే అందిస్తుండగా… పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ ఓ రోడ్ షో నిర్వహించారు. పలుసార్లు నియోజవర్గ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక మంత్రులు – పార్టీకి చెందిన సీనియర్లు కూడా హుజూర్ నగర్ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం ముగియడానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో సడెన్ గా కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ ఎస్ ప్రకటించడం చూస్తుంటే… అక్కడ గులాబీ దళానికి గెలుపుపై ఆందోళన మరింత పెరిగినట్టే కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం కోసం మంత్రులు – టీఆర్ ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. అయితే ఉప ఎన్నికల సంధర్భంలోనే ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో కష్టకాలం ఎదురైంది. దీంతో ఆర్టీసీ కార్మీకుల సమ్మె ఎఫెక్ట్ కూడా ఎన్నికలపై పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన సీపీఐ సైతం తమ మద్దతు ఉపసంహరించుకునేందుకు సన్నద్దమైంది. దీంతో టీఆర్ ఎస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గోనడం ద్వార ఓటర్లపై ఎలాంటీ ప్రభావం పడుతుందో వేచి చూడాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహిస్తుండగా – 19వ తేదిన ప్రచారం ముగియనుంది. 24వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ నుండి సైదిరెడ్డి – ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి పద్మావతి రెడ్డి బరిలో నిలవగా ఇద్దరి మధ్యే ప్రధాన పోటి కొనసాగనుంది.
Please Read Disclaimer