కేసీఆర్ గల్ప్ దేశాల పర్యటన వెనుక కొత్త వ్యూహం

0

టీడీపీ అధినేత చంద్రబాబుతో పోలిస్తే.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విదేశీ పర్యటనలు చాలా తక్కువగా చేస్తారని చెప్పాలి. ఎప్పుడో కానీ ఆయన దేశం దాటి వెళ్లేందుకు ఆసక్తిని ప్రదర్శించరు. మరికొద్ది రోజుల్లో గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. విదేశీ పర్యటలు తక్కువగా వెళ్లే గులాబీ బాస్.. ఎందుకని గల్ఫ్ దేశాలకు వెళుతున్నారంటే.. దానికో లెక్క ఉందని చెబుతున్నారు.

తన గల్ఫ్ పర్యటనలో ఆయా దేశాల్లో పని చేసే వేలాది మంది తెలంగాణ బిడ్డల్ని తిరిగి స్వదేశానికి వచ్చేయాలని పిలుపు ఇవ్వాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని..ఒకప్పుడు ఉపాధి కోసం తెలంగాణ వీడి.. వేరే రాష్ట్రాలకు.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.

ఇప్పుడు అందుకు భిన్నంగా తెలంగాణకే దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు ఉపాధి కోసం వస్తున్న పరిస్థితి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మానవ వనరుల కొరత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్న వేళ.. రాష్ట్రానికి చెందిన వారు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్న విషయాన్ని అందరికి చెప్పే ఉద్దేశంతోనే కేసీఆర్ తాజా విదేశీ పర్యటనగా చెబుతున్నారు.

గల్ఫ్ దేశాల్లో రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడినా వస్తున్న సంపాదన అరకొరగా ఉన్న వేళ.. తెలంగాణలో ఇటీవల కాలంలో పెరిగిన వేతనాల నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వస్తున్నారు.

అలాంటప్పుడు తెలంగాణ బిడ్డలు ఎక్కడికో ఎందుకు వెళ్లాలి? ఎక్కడో ఎందుకు పని చేయాలి? మీ సొంత గడ్డ మీదే మీరు పని చేసే అవకాశం ఉందని చెప్పటంతో పాటు.. అలా తిరిగి వచ్చే వారికి రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగంతో పాటు.. మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థల్లో ఉపాధి అవకాశాల్ని ఇప్పించాలన్నది కేసీఆర్ ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో.. భారీ మైలేజీ రావటమే కాదు.. కేసీఆర్ ఇమేజ్ పూర్తిగా మారుతుందన్న ఆలోచనలో టీఆర్ఎస్ వ్యూహకర్తలు ఉన్నట్లు చెబుతున్నారు.
Please Read Disclaimer