దేశాధ్యక్షుడ్ని నోరు మూసుకోవాలన్న పోలీస్ చీఫ్

0

ఒక దేశాధ్యక్షుడ్ని ఒక పోలీస్ చీఫ్ నోరు మూసుకోమని చెప్పే అవకాశం ఉంటుందా? అంటే.. నో చెబుతారు. అందునా.. అమెరికా అధ్యక్షుడు లాంటి పవర్ ఫుల్ అధినేతను ఉద్దేశించి ఒక సీనియర్ అధికారి నోటి వెంట ఇంత కఠినమైన మాటను ఊహించలేం. కానీ.. అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి హ్యుస్టన్ సిటీ పోలీస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ.. ఆయన ఎందుకంత కఠిన వ్యాఖ్య చేయాల్సి వచ్చిందన్న విషయంలోకి వెళితే..

ఒక పోలీసు అధికారి దుర్మార్గానికి నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు వదలటం.. అతడి పట్ల శ్వేతపోలీసు వ్యవహరించిన కర్కసత్వానికి యావత్ అమెరికా రగిలిపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వైట్ హౌస్ ను దిగ్బంధించేందుకు ప్రయత్నం జరగటం.. నిరసనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికా అధ్యక్షుడు బంకర్ లోకి వెళ్లేంత పరిస్థితి చోటు చేసుకుంది.

నిరసనలు జరుగుతున్నప్పుడు అనునయంగా మాట్లాడాల్సింది పోయి.. వారు మరింత చెలరేగిపోయేలా ట్విట్టర్ లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లూటీలు చేయటం మొదలు పెడితే కాల్పులు తప్పదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరే దేశాధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. కానీ.. ట్రంప్ లాంటి నేత నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటాన్ని జీర్ణించుకోలేని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పోలీస్ చీఫ్ అర్ట్ అసేవెడో కాస్త కటువుగా స్పందించారు.

అధ్యక్షుడు ట్రంప్ నోరు మూసుకోవాలన్న సూచన చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఆందోళనకారుల ఆగ్రహం మరింత పెరుగుతుందే తప్పించి మరేమీ ఉండదన్నాడు.ఇలాంటి వ్యాఖ్యలు వారిని మరింత రెచ్చగొట్టేలా చేస్తాయన్నారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడే బదులు.. నిర్మాణాత్మక కార్యక్రమాన్నిప్రకటిస్తే బాగుంటుందన్నారు.

‘మీకు చెప్పటానికి ఏమీ లేకపోతే.. చెప్పకండి’ అంటూ వ్యాఖ్యానించారు. నిరసనకారులపై ట్రంప్ ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్యన వివిధ రాష్ట్రాల గవర్నర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. మీరు బలహీనంగా ఉననారు. నిరసనకారులపై పైచేయిగా వ్యవహరించండి. లేకుంటే టైం వేస్ట్ చేయటమే అవుతుంది. మీరు ఇలానే ఉంటే.. వారు మీ తలపైకెక్కి నాట్యం చేస్తారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని పలువురు తప్పు పట్టారు.
Please Read Disclaimer