రాజధాని ఏపీ అంతర్గత వ్యవహారంః కిషన్ రెడ్డి

0

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ప్రతిపాదన గురించి బీజేపీ నేతలు తలో రకంగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి కామెంట్స్ ఆసక్తిదాయకంగా మారాయి. మూడు రాజధానుల ప్రతిపాదన అనేది ఏపీ రాష్ట్ర అంతర్గత వ్యవహారం అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని అంశం ఏపీ అంతర్గత వ్యవహారం అంటే.. అందులో కేంద్రం జోక్యం చేసుకోబోదు అని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఇదే తరహా ప్రకటనలు చేశారు కొంతమంది బీజేపీ నేతలు. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని అంశం రాష్ట్ర అంతర్గత అంశం అన్నారు.

ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా దాదాపు అదే ప్రకటన చేశారు. అలాగే మూడు రాజధానుల ప్రతిపాదన గురించి కేంద్రానికి ఇంకా పూర్తి సమాచారం ఏదీ లేదని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా కసరత్తును పూర్తి చేయని సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఇంకా సమాచారం ఏదీ లేదని కిషన్ రెడ్డి అన్నారు.

అధికారికంగా ప్రకటించే వరకూ బీజేపీ నేతలు కూడా సంయమనం పాటించాలని కిషన్ రెడ్డి అన్నారు. పూర్తి స్పష్టత రాకముందే బీజేపీ నేతలు స్పందించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు వేచి చూడాలని అధికారిక ప్రకటన వచ్చే వరకూ సహనం వహించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయిన కిషన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడటం భారతీయ జనతా పార్టీ లో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేతలకు ఝల్ అని చెప్పవచ్చు. కేంద్రం జోక్యం చేసుకోదని కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటించడం గమనార్హం.
Please Read Disclaimer