కేటీఆర్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యే పిట్టా?

0

బీజేపోడు ఇట్లనే ఆర్నెల్లు మొరిగి పోతడు.. పట్టించుకోవద్దు అంటూ తమ పార్టీ నేతలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తెలిసిందే. తమను అంత సింఫుల్ గా తీసిపారేసిన వేళ.. బీజేపీకి చెందిన కొత్త ముఖాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నారు. కొత్త కొత్త అంశాల్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ అండ్ కోను ఉక్కిరిబిక్కిరి చేసేలా విమర్శలు చేయటం గమనార్హం.

తాజాగా బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొల్లి మాధవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కేసీఆర్ ఇచ్చే విలువ ప్రజలకు ఇవ్వటం లేదన్న ఆమె.. మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ చట్టాన్ని తీసుకు రావటాన్ని తప్పు పట్టారు. టీఆర్ ఎస్ చేసిన ఎన్నికల హామీల్ని బీజేపీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుందన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల్లో వైఫల్యం చెందినట్లుగా మండిపడ్డారు.

మున్సిపాలిటీలకు వంద రోజుల ప్రణాళికలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ మైండ్ సెట్ లో మార్పు రావాలన్న ఆమె.. వార్డుల విభజన శాస్త్రీయత లేకుండా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ తీరు చూస్తే.. ఆయనలోని పిరికితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు కమ్ రాజకీయ వారసుడు కేటీఆర్ ను కొల్లి మాధవి వదిలిపెట్టలేదు. కేటీఆర్ ను ఆమె కొత్తతరహాలో పంచ్ వేశారు. కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించే పిట్టగా అభివర్ణించారు. ట్విట్టర్ ట్వీట్లు చేయటమే పాలనగా ఆయన భావిస్తారన్నారు. వర్షం వస్తే హైదరాబాద్ జలమయం అవుతుందన్న ఆమె.. సెప్టెంబరు ఆరు నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో పాలన అన్నది లేదన్నారు.

తొమ్మిది నెలల వయసున్న చిన్నారిపై ఆఘాయిత్యం జరిగితే ప్రభుత్వం స్పందించలేదన్న ఆమె.. కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్లు చేయటాన్ని తప్పుపట్టారు. కొల్లి మాధవి పెట్టిన పేరుతో ఇకపై కేటీఆర్ ట్వీట్లు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారన్న అభిప్రాయం కలుగక మానదు.
Please Read Disclaimer