ఏపీలో 6-9వ తరగతి పరీక్షలు రద్దు

0

కరోనా మహమ్మారి ప్రభావం ఇటు వ్యాపార వాణిజ్య ఉపాధి ఉద్యోగ రంగాలతో పాటు విద్యారంగంపై కూడా పడిన సంగతి తెలిసిందే. ఏపీ తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ లోనే కరోనా రావడంతో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. ఒక పరీక్ష నిర్వహించిన అనంతరం హైకోర్టు ఆదేశాలతో టీ సర్కార్ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఏపీలో ఒకటి మినహా ఇంటర్ పరీక్షలన్నీ ముగియగా…పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఎంసెట్ ఐసెట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం దరఖాస్తు తేదీలను పొడిగించారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఆయా తరగతులకు చెందిన విద్యార్థులను నేరుగా తర్వాత తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

కరోనాను కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ప్రజలంతా దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు నిత్యావసరాలు మినహా మిగతా సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. సాధారణంగా ఏప్రిల్ 21 నుంచి జూన్ 5 వరకు పాఠశాలలకు సెలవులిస్తుంటారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండడం…ఆ తర్వాత కూడా పరిస్థితిని బట్టి లాక్ డౌన్ పొడిగించే చాన్స్ ఉండడంతో ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. 6 నుంచి 9 వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను తదుపరి తరగతులకు పరీక్ష లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారి ఇళ్లకే పంపిస్తామని తెలిపారు. మార్చి 31వ తేదీన కరోనాపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి పరీక్షలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి కూడా ఇదే తరహా లో 1-8 వ తరగతి వరకు పరీక్షలు లేకుండా నేరుగా పాస్ అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-