సీఎస్‌పై జగన్ వేటు.. కేంద్రం సీరియస్.. ఎల్వీకి కీలక బాధ్యతలు?

0

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కారు అనూహ్యంగా బదిలీ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏరి కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఉన్న ఫళంగా ఎందుకు బదిలీ చేశారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీ సర్కారు రాజ్యాంగ సంక్షోభం దిశగా నడుస్తోందని అన్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోంది. కళ్లు మూసుకుని లేదంటూ ఆయన హెచ్చరించారు.

సుజనా చౌదరి విమర్శలను పక్కనబెడితే.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయడం పట్ల కేంద్రం సీరియస్‌గా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. సీఎస్ పట్ల వ్యవహరించిన తీరు బాగోలేదని.. ఏపీ ప్రభుత్వం తీరుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని వార్తలొస్తున్నాయి.

కేంద్ర ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. అప్రాధాన్య పోస్టుకు బదిలీ అయిన సుబ్రహ్మణ్యం.. కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన సేవలను వాడుకోవాలని కేంద్రం కూడా భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు గానీ.. ఎల్వీ సుబ్రహ్మణ్య పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. ఏదైనా కీలక బాధ్యతల్లోకి ఆయన్ను తీసుకుంటే.. పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. తెలుగు వారైన కేవీ చౌదరి నాలుగేళ్లపాటు సీవీసీగా పని చేయగా.. జూన్ 11న ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. దీంతో కొద్ది రోజులకే ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తారనుకోలేం.
Please Read Disclaimer