మహారాష్ట.. మరో న్యూయార్క్ అవుతోందా?

0

కరోనా కల్లోలంతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే కేసులు లక్ష దాటడంతో ఆ రాష్ట్రంలో మహమ్మారి వైరస్ జడలు విప్పుతోంది. కేవలం 96రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా కేసులు లక్ష దాటడం పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపిస్తోంది. మహారాష్ట్ర కేసుల్లో చైనా కెనడా వంటి దేశాలను కూడా దాటిపోయింది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

మహారాష్ట్రలో 50వేల కేసులు నమోదు కావడానికి 77 రోజులు పడితే.. మరో 50వేల కేసులు కేవలం 19 రోజుల్లోనే దాటడం వైరస్ ఏ స్థాయిలో ఆ రాష్ట్రంలో విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.01141 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 3వ వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ఇందులో సగానికి పైగా కేసులు ఒక్క ముంబైలోనే కావడం గమనార్హం. ముంబైలో 55వేల కేసులు.. తర్వాత థానేలో 16వేలు ఫుణేలో 11వేల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3717 ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపిస్తోందంటున్నారు. ముంబైలో అయితే న్యూయార్క్ కంటే ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకే మంచంపై ఇద్దరు రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ కోసం 2 గంటలు వేచి ఉండాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.అప్పటికే ప్రాణాలు పోతున్నాయంటున్నారు.

దేశజనాభాలో మహారాష్ట్రలో ఉన్నది 11.6 కోట్లు. ఇందులో ముంబైలోనే 42శాతం జనాభా మురికివాడల్లో ఉన్నారు. వీరే కరోనా వాహకులుగా మారారని అంటున్నారు. లాక్ డౌన్ సడలింపులతో అందరూ వీధుల్లోకి రావడంతో ఈ పరిస్థితి దాపురించింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చూస్తుంటే న్యూయార్క్ లో కంటే దారుణ కరోనా విలయం.. వినాశనం మహారాష్ట్రలో కనిపించడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి పాలన అనుభవం లేకపోవడం కూడా కేసుల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.