యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు: మందక్రిష్ణ సంచలన ఆరోపణలు

0

ప్రముఖ సినీ విశ్లేషకుడు నటుడు అయిన కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ. తాజాగా చిత్తూరు జిల్లాలోని మహేష్ కత్తి స్వగ్రామం యలమందలో జరిగిన అంత్యక్రియల్లో మందక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజాయితీగల పోలీస్ అధికారితో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో కత్తి మహేష్ మృతిపై విచారణ జరిపించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మందక్రిష్ణ కోరారు. నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కత్తి మహేష్ మరణం దాకా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంద క్రిష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘కత్తి మహేష్ మృతిపై మాకు అనుమానాలున్నాయి. వివిధ ప్రసారసాధనాల్లో కత్తి మహేష్ అభిప్రాయాలతో చాలా మంది శత్రువులు అయ్యారు. గతంలో జరిగిన ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. యాక్సిడెంట్ ఆస్పత్రిలో ఆయన మరణంపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి కత్తి మహేష్ మరణించే నాటికి 15 రోజులు గడిచాయని.. యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? మరణం ఎలా సంభవించింది.. ఒక నిజాయితీగల పోలీస్ అధికారి లేదా సిట్టింగ్ జడ్జీతో దీనిపై విచారణ జరిపించాలని’ మందకృష్ణ డిమాండ్ చేశారు.

కత్తి మహేష్ మృతిపై మందక్రిష్ణ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘విజయవాడ నుంచి కత్తి మహేష్ ఆ రోజు రాత్రి 12 గంటలకు బయలు దేరాడు. నెల్లూరుకు 13 కి.మీల దూరంలో యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ సీటులో సురేష్ అనే సోదరుడు పక్క సీటులో కత్తి మహేష్ కూర్చున్నారు. మహేష్ కూర్చున్న కుడివైపే ప్రమాదం జరిగింది. ఆ పక్కనే కూర్చున్న సురేష్ కు ఏ చిన్న గాయం తగలకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక కత్తి మహేష్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏదీ లేదని ఆయన మామ బంధువులు నాతో ఫోన్లో చెప్పారు. వైద్యులు కూడా ఒక కన్ను తీసేసయాల్సి వస్తుందని.. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరో 3 4 రోజుల్లో మహేష్ ను డిశ్చార్జి చేస్తామన్నారు’ అని మందక్రిష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కత్తి మహేష్ మరణానికి కేవలం ఐదు నిమిషాల ముందు సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారని మందక్రిష్ణ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చనిపోయారని చెప్పారన్నారు. ఈ సందర్భంగా ఆ ఆస్పత్రిలో కత్తి మహేష్ కు అందించిన చికిత్స వివరాలను వెల్లడించాలని మందక్రిష్ణ డిమాండ్ చేశారు. ఆయన మరణంలో అన్ని వాస్తవాలు వెలుగుచూడాలన్నారు.

మేము పరివర్తన కోరుకునే మనుషులమే తప్ప ప్రతీకారం తీర్చుకునే వారం కామని.. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఉన్నవాళ్లమని మందక్రిష్ణ తెలిపారు. కత్తి మహేష్ మరణం తర్వాత వస్తున్న కామెంట్లను చూస్తుంటే ఆయన మరణించాలని ఎంతగా కోరుకున్నారో అర్థమవుతోందన్నారు. కాబట్టి ఆయన మరణించడానికి ఎవరైనా ప్లాన్ చేశారా? అన్న అనుమానం కలుగుతోంది అని మందక్రిష్ణ ఆరోపణలు గుప్పించారు.

చిత్తూరు జిల్లాలోని మహేష్ కత్తి స్వగ్రామం యలమందలో సోమవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణతోపాటు ఆ సంస్థ కార్యకర్తలు ప్రజాస్వామిక వాదులు అంత్యక్రియలకు హాజరయ్యారు.