అద్వానీ చేయలేని పని చేసిన మాజీ సీఎం కొడుకు!

0

ఆశ.. ఆశ.. ఎంత సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత అత్యున్నత స్థానానికి ఎదిగినా ఎంతకూ తీరని దాహం కొందరికి ఉంటుంది. ఇది మంచిగా ఉన్నంతవరకూ ఓకే. కానీ..సంప్రదాయాల్ని.. వ్యవస్థల్ని.. విలువల్ని పాతర వేసేలా ఉంటేనే ఇబ్బంది. తాజాగా ఇలాంటి తీరునే ప్రదర్శిస్తూ ఏమైంది వీళ్లకు.. ఎందుకింత ఆత్రమన్నట్లుగా మోడీషాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

తమకు బలం లేకున్నా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యం.. ప్రత్యర్థి పార్టీలేవీ ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న మోడీషాల వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలో అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ పార్టీకి ఉన్న విలువల్ని వదిలేసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.

వలసల్ని ప్రోత్సహించటం.. చీలికల్ని ప్రేరేపించటం..రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటం.. మొత్తంగా ప్రభుత్వాల్ని పడగొట్టటమే లక్ష్యంగా పెట్టుకున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోని వేళ.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో కాకలు తీరిన యోథులు.. కొమ్ములు తిరిగిన మొనగాళ్లు లాంటి నేతలంతా మౌనముద్ర దాల్చిన వేళ.. ఒక యువనేత తన గళాన్ని విప్పారు.

అతడెవరో కాదు.. నిలువెత్తు నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచి యావత్ భారతావనికి ఆదర్శప్రాయుడిగా ఉంటూ.. ఈ మధ్యనే అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కుమారుడు ఉత్పల్ పారీకర్. తాజాగా ఆయన బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తన సిద్ధాంతాల్ని మర్చిపోయిందని.. కొత్త దారుల్లో వెళుతోందని తప్పుపట్టారు.

గోవా అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేని బీజేపీ సర్కారును మరింత బలోపేతం చేసేందుకు వీలుగా కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల్ని చీల్చి.. బీజేపీలో విలీనం చేసిన వైనాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఉత్పల్.. మా నాన్న నాటి పార్టీ కాదిది. విశ్వాసం.. నిబద్ధత.. పునాదులుగా పార్టీ నడిచేది. మార్చి 17 తర్వాత ఆ రెండు పదాలు పార్టీకి దూరమయ్యాయి.. పార్టీ తన పంథాను మార్చుకుంటోంది. ఈ విషయాల్ని చెప్పేందుకు ఇదే సరైన సమయమని తాను చెబుతున్నట్లు చెప్పారు.

బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ సైతం నోరు విప్పని వేళ.. అందుకు భిన్నంగా ఒక యువనేత నోరు విప్పి నిజాన్ని నిర్భయంగా చెప్పటం ద్వారా మనోహర్ పారీకర్ కు అసలుసిసలు రాజకీయ వారసుడిగా చెప్పకతప్పదు.
Please Read Disclaimer