పీపీఈ కిట్లతో పెళ్లి భోజనాలు!

0

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలు చితికిపోయాయి. మనుషుల జీవనశైలి మారిపోయింది. ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరిస్తున్నారు. పెళ్ళిళ్ల సీజన్ ప్రారంభమైంది. శుభకార్యాలకు – పండుగలకు కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ నెల 22వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని ముదినేపల్లి గ్రామంలో జరిగిన పెళ్లి అందర్నీ ఆకట్టుకుంది. ఈ పెళ్లి ఆర్గనైజర్లు – ఈవెంట్ మేనేజర్స్ తమ సర్వీస్ స్టాఫ్ కోసం పీపీఈ కిట్స్ ఇచ్చారు.

కరోనా నిబంధనల మేరకు ఈ పెళ్లి తక్కువమంది అతిథులతో జరిగింది. అయితే పెళ్లి విందుకు వచ్చిన అతిథులకు మాత్రం భోజనం వడ్డించే కేటరింగ్ బాయ్స్ అందరూ పీపీఈ కిట్స్ ధరించారు. గుడివాడకు చెందిన కోటి కేటర్స్ మహమ్మారి నేపథ్యంలో తమ సిబ్బందికి ముందు జాగ్రత్తగా పీపీఈ కిట్స్ ఇచ్చింది. స్టాఫ్ వీటిని ధరించి వడ్డించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వడ్డించే వారు పీపీఈ కిట్స్ ధరించడంతో కొంతమంది అతిథులు తొలుత షాక్ కు గురయ్యారు. ఎవరైనా కరోనా సోకిన వ్యక్తి ఉన్నారేమోనని ఆందోళన చెందారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. ఈ పెళ్లికి హాజరైన చాలామంది అతిథులు ఆర్గనైజర్స్ను ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమని సోషల్ మీడియాలోను ప్రశంసలు వెల్లువెత్తాయి. శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహ శుభకార్యాలు జరుపుతున్నారు.