ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

0

ప్రముఖ బంగారు నగల విక్రయ సంస్థ ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్ బౌన్స్ కేసులో సుఖేష్ గుప్తాను మంగళవారం (అక్టోబర్ 29) హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీపై కలకత్తా కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉంది. కలకత్తాకు చెందిన బ్యాంకు నుంచి ఆయన కోట్ల రూపాయల లోన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదు. అంతేకాకుండా బ్యాంక్‌కు సుఖేష్ గుప్త ఇచ్చిన చెక్.. బౌన్స్ అయింది.

చెక్ బౌన్స్ కావడంతో బ్యాంకు సిబ్బంది కలకత్తా కోర్టులో కేసు వేశారు. పిటిషన్‌ విచారణ చేపట్టిన న్యాయస్థానం సుఖేష్ గుప్త మీద చెక్ బౌన్స్ కేసు కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌ను వెంటనే అమలు చేయాలని సుల్తాన్ బజార్ పోలీసులకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అరెస్ట్ చేశారు.

సుఖేశ్‌ను అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు ఆయణ్ని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం పీటీ వారెంట్ ద్వారా కలకత్తాకు తరలించారు. బుధవారం ఉదయం కలకత్తా కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ అరెస్టుకు గురవడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



Please Read Disclaimer