ఇలాంటి మగ మృగాలను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు: చిరంజీవి

0

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనపై మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు స్పందించకపోవడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించే స్టార్ హీరోలు.. ఇంత క్రూరమైన సంఘటన జరిగినా ఎందుకు స్పందించడం లేదంటూ చాలా మంది ప్రశ్నించారు. అయితే, ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.

‘‘గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.

త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలు అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్‌లో 100 నంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘హాక్ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ హుటాహుటిన మీ దగ్గరకు చేరుకుంటాయి. పోలీసు వారి సేవలను అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని వీడియోలో చిరంజీవి అన్నారు.
Please Read Disclaimer