లక్ష్మీపార్వతి వల్లే దక్కలేదు.. మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం

0

ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ శాసనసభలోని అత్యంత సీనియర్లలో ఆయనొకరు. గతంలో ఎన్టీఆర్ హయాంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కాల్సింది. చంద్రబాబు హయాంలోనూ నిరాశే ఎదురైంది. నేటివరకూ అది అందని ద్రాక్షే అయింది. చివరికి కేసీఆర్‌తో తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నారు. ఆయనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజా నేతగా గుర్తింపు పొందిన దయాకర్ రావు.. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. మంగళవారం (ఫిబ్రవరి 19) చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను ఎర్రబెల్లికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన ఘటనలను గుర్తుకుతెచ్చుకున్నారు.

‘ఎన్టీఆర్‌ నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. కానీ, అప్పుడు లక్ష్మీపార్వతి అడ్డుకున్నారు. ఆమె వల్లే నాకు మంత్రి పదవి రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు కూడా నాకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మాట తప్పారు. ఇప్పుడు కేసీఆర్‌ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకొని నాకు మంత్రి పదవి ఇచ్చారు’ అని ఎర్రబెల్లి తెలిపారు.
Please Read Disclaimer