పాక్ ప్రధాని పక్కనుండగా.. మోదీని ఇరుకునబెట్టిన ట్రంప్!

0

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా నుంచి అందే భారీ సాయం ఆగిపోవడం.. మరోవైపు సాయానికి చైనా చుక్కలు చూపిస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో ఇమ్రాన్ ఖాన్ ట్రంప్‌ను కలవడానికి వెళ్లాడు. పొదుపు మంత్రం పాటిస్తోన్న ఇమ్రాన్.. ప్రత్యేక విమానంలో కాకుండా.. సాధారణ వ్యక్తిలాగే అమెరికా వెళ్లాడు. హోటల్లో ఉంటే డబ్బులు అయిపోతాయని పాక్ రాయబారి నివాసంలోనే బస చేస్తున్నాడు. మూడు రోజుల ఈ పర్యటన మొత్తం ఖర్చు 60 వేల డాలర్లు. పాకిస్థాన్ ప్రధాని ఇంత తక్కువ ఖర్చుతో అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి.

వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ఇమ్రాన్ ఖాన్.. మెల్లగా తన కోరికల చిట్టాను ఆయన ముందుంచాడు. పనిలో పనిగా కశ్మీర్ సమస్యను లేవనెత్తాడు. ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడుతుండగా.. 70 ఏళ్లుగా సాగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ట్రంప్ మధ్యవర్తిత్వం కోరుతున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.

ప్రపంచంలో ప్రతి అంశంలోనూ వేలు పెట్టడానికి ఆసక్తి చూపే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఓస్.. అదెంత భాగ్యం అలాగే అనేశాడు. పనిలో పనిగా రెండు వారాల క్రితం భారత ప్రధాని మోదీని కలిశాను. ఆయన కూడా సేమ్ టు సేమ్ నీలాగే మాట్లాడడబ్బా.. అని ఇమ్రాన్‌కు చెప్పాడు. మీరు మధ్యవర్తిత్వం వహిస్తారా? సమస్యను పరిష్కరిస్తారా? అని మోదీ నన్ను అడిగాడు. ఎక్కడంటే.. కశ్మీర్ అంశం గురించి అన్నాడు. ఇద్దరూ కోరుకుంటున్నారు కాబట్టి.. నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ భరోసా ఇచ్చేశాడు. మీరు ఈ పని చేసి పెడితే.. వంద కోట్ల మందికిపైగా ఊరట చెందుతారు మహా ప్రభో అని ఇమ్రాన్ బదులిచ్చాడు.

మరో విషయం ఏంటంటే.. కశ్మీర్ సమస్య పరిష్కారంలో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఈ మధ్యే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అసలు చర్చలు జరపకుండానే కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. అంటే పాకిస్థాన్‌తో చర్చలకే భారత్ సుముఖంగా లేదు. కానీ పాక్ మాత్రం ఏకంగా మూడో దేశం ప్రమేయాన్ని కోరుతోంది. ప్రభుత్వ వర్గాలు ట్రంప్ ప్రకటనను కొట్టిపారేశాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం ఇబ్బందుల్లో పడిపోయారు. ఎందుకంటే.. అమెరికా తెలివిగా ఈ పాచిక విసిరింది. ఇప్పుడు మూడో దేశం జోక్యాన్ని సహించబోమనే వాదనకు కట్టుబడి ఉంటామని భారత్ చెబితే.. ట్రంప్ అబద్ధం చెప్పాడా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అమెరికా అధ్యక్షుడు అబద్ధమాడాడు అనడం.. టీచర్ వీడు అబద్ధం చెబుతున్నాడని స్కూల్ పిల్లాడు ఆరోపించినంత తేలికేం కాదు. దానికి దౌత్యం అడ్డొచ్చే అవకాశాలున్నాయి.
Please Read Disclaimer