ఆన్ లైన్ మోసాలు.. చెబితే డబ్బు గోవిందే..

0

టెక్నాలజీ మనిషికి ఎంత మేలు చేస్తుందో అంతే చెడు చేస్తోందని చెప్పక తప్పదు. బ్యాంకుల ద్వారా ఆన్ లైన్ ట్రాన్స్ సాక్షన్స్ జరగడం ప్రస్తుతం ఎక్కువైంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి ఈ ఆన్ లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించడం.. భీమ్ పేరుతో అన్ని యాప్ లు చెల్లించేలా స్కాన్ కోడ్ లను రూపొందించడంతో ఇప్పుడంతా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. అయితే వాటితో పాటు మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతుండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకోవడమే పరమావధిగా ఉత్తర భారతం నుంచి అమాయక తెలుగు ప్రజలకు వల విసురుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ ఆన్ లైన్ మోసాలు రోజుకు చాలా వరకు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.1.5 కోట్ల వరకు దోచుకుంటున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 18 కోట్లను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా వీరంతా రాజస్థాన్- బీహార్- ఉత్తరప్రదేశ్- ఢిల్లీ- జార్ఖండ్- హర్యానా తదితర రాష్ట్రాల నుంచి కనీసం పదోతరగతి చదవని మోసగాళ్లు హిందీలో మాట్లాడుతూ అమాయకులకు వల వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి.. బ్యాంక్ నుంచి అంటూ రోజుకు 200 నుంచి 300 వరకు అమాయకులకు ఫోన్లు చేస్తున్నారు. అందులో కనీసం 10 మంది నుంచి 20 మందిని తమ బుట్టలో వేసుకొని రూ.5 వేల నుంచి 5 లక్షల వరకు కాజేస్తున్నారు.

ప్రధానంగా ఈ మోసగాళ్లు డెబిట్ కార్డుల నంబర్లు- సీవీవీలు- ఫోన్ కు వచ్చే ఓటీపీని చెప్పమంటూ తెలివిగా మాటల్లో పెట్టి డబ్బులు కాజేస్తున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఆన్ లైన్ మోసగాళ్లు తెలివిగా బుట్టలో వేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇక ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కష్టంగా మారింది. వారు ఉత్తరాదిలో ఫేక్ ఫోన్ నంబర్లు ఐడీలతో ఎవరి పేరుమీదనో ఎక్కడి నుంచో ఫోన్లు చేసి మోసం చేస్తుండడంతో వారు చిక్కడం లేదు.

అందుకే వినియోగదారులు ఎవరైనా సరే ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగినా.. డెబిట్ కార్డు నంబర్లు అడిగినా ముఖ్యంగా ఓటీపీ అడిగినా చెప్పవద్దని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
Please Read Disclaimer