జయప్రద నిప్పుల కంటే.. ఆజంఖాన్ కన్నీళ్లకే కరిగిపోయారు

0

యూపీ అన్నంతనే గుర్తుకు వచ్చే కొద్దిమంది నేతల్లో సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్. వివాదాస్పద వైఖరితో పాటు.. వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ మీద ఒంటరి యుద్ధం చేస్తుంటారు. అలాంటి ఆయనకు చుక్కలు చూపించటంలో కమలనాథులు సక్సెస్ అయ్యారు. ఎలాంటి వారినైనా ఎలా లొంగదీసుకోవాలన్న దానిపై బీజేపీ అధినాయకత్వానికి ఉన్నంత క్లారిటీ మరెవరికీ ఉండదనే చెప్పాలి.

యూపీలో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆజంఖాన్ మీద ఏకంగా 80 కేసులు నమోదయ్యాయి. ఆయన్ను రాజకీయంగా ఎంత ఇబ్బంది పెట్టాలన్నా.. ఆయన వెనకే ఓటర్లు ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి. తాజాగా తన సత్తాను చాటారు ఆజంఖాన్. యూపీలో జరిగిన రామ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆజంఖాన్ సతీమణి తాజీన్ ఫాతిమా బరిలోకి దిగారు.

ఈ సీటులో ఎలాగైనా పాగా వేయాలని భావించిన బీజేపీ..ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆజంఖాన్ కు చుక్కలు చూపించింది. తన రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఆజంఖాన్ లాంటోడు.. చివరకు ఎన్నికల ప్రచార వేళ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని బీజేపీ నాయకురాలు జయప్రద ప్రస్తావిస్తూ.. ఆజంఖాన్ మహిళల పట్ల చాలా చులకనగా వ్యవహరించారని.. అలాంటి నేత ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే మహిళలు ఏమీ కరగరని.. వారి శక్తి ఏమిటో చూపిస్తారంటూ శాపాలు పెట్టారు.

కానీ.. తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తుంటే.. ఆజంఖాన్ పై జయప్రద చేసిన శాపాల కంటే కూడా.. ఆజంఖాన్ వేదనతో పెట్టుకున్న కన్నీళ్లకే రామ్ పూర్ ఓటర్లు ఎక్కువగా కరిగినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన రామ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆజంఖాన్ సతీమణి అధిక్యతలో దూసుకెళుతున్నారు. ఉప ఎన్నిక మొత్తం ఆజం వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీకి వెనుకంజ తప్పలేదు. మొత్తానికి ఎన్నికల ప్రచార సందర్భంగా ఆజంఖాన్ పెట్టుకున్న కన్నీళ్లు ఆయనకు విజయానికి దగ్గర చేశాయని చెప్పక తప్పదు.
Please Read Disclaimer