కేకే మహమ్మద్… రామజన్మభూమి హిందువులకు దక్కేలా చేసిన పరిశోధకుడు

0

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంటూ ఎన్నో ఎన్నికల్లో ప్రజల్లో సెంటిమెంట్లను రగిలించడానికి పనికొచ్చిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు ఎట్టకేలకు ముగింపు పలికింది. అయోధ్యంలోని వివాదాస్పన 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని.. అందులో ఒక్క అంగుళం కూడా ముస్లింలకు చెందదని తేల్చింది. అందుకు ఎన్నో చారిత్రక ఆధారాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. అయితే ఈ చారిత్రక ఆధారాలలో అత్యధికం ఒక ముస్లిం పరిశోధకుడు సంపాదించినవే కావడం విశేషం. ఆయనే కేకే మహ్మద్. పురావస్తు శాఖలో పనిచేసిన ఆయన అయోధ్యలో రామాలయానికి సంబంధించిన అనేక ఆధారాలు అందించారు.

భారత పురాతత్వ సర్వే అంటే ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’కు జనరల్ బీబీ లాల్ డైరెక్టరుగా ఉన్నప్పుడు 1976లో మొట్టమొదటిసారి రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిలో పురాతత్వ సర్వే చేశారు. అప్పుడు బీబీ లాల్ బృందంలో కేకే మహ్మద్ కూడా ఉన్నారు. మహ్మద్ అప్పటికే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి చరిత్రలో పీజీ చదివారు. ఆ తరువాత స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీలో చదువుతూ విద్యార్థిగా ఉంటూ ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే విషయాలు అధికారికంగా బయటకు రావడానికి ముందే ఆయన.. ఆ వివాదాస్పద స్థలంలో పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలు దొరికాయని ప్రకటించి సంచలనం సృష్టించారు.

అయితే.. మహ్మద్ వాదనను కొట్టిపారేస్తూ కొందరు ఆ అవశేషాలు హిందూ ఆలయానికి సంబంధించనవనని గ్యారంటీ ఏమిటంటూ జైన బౌద్ధ ఆలయాలకు చెందినవి కావొచ్చన్న వాదన తెచ్చారు. అయితే… అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్న ఒక ముస్లిం విద్యార్థి స్వయంగా అక్కడ ఆలయం ఉందని చెప్పడంతో ఆ మాటలను తుడిచివేయడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఆ తరువాత 2003లో మరోసారి సర్వే చేశారు. అప్పుడు కూడా పురాతత్వ శాఖలో కొందరు ముస్లింలు పనిచేస్తుండేవారు. వారిలోనూ కొందరు అక్కడ ఆలయ శిథిలాలే ఉన్నాయని తేల్చారు. ఇవన్నీ రికార్డు కావడంతో కోర్టు వాటిని ఆధారాలుగా స్వీకరించింది.

పురాతత్వ శాఖలో ఉత్తర భారతదేశ డైరెక్టరుగా పనిచేసి రిటైరైన మహ్మద్ ప్రస్తుతం కేరళలో నివాసం ఉంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలో జరిపిన తవ్వకాలలో పొడవాటి గోడలు గోపురం లాంటివి ఉన్నాయి. అవి ఇస్లామిక్ నిర్మాణాలు కానేకావు.. పైగా ఆ గోడలపై విగ్రహాలున్నాయి. ఇస్లాం ప్రార్థనా స్థలాలైతే విగ్రహాలుండవు అని తేల్చిచెప్పారు. పదో శతాబ్దానికిచెందిన శిలా శాసనాలు కూడా అక్కడ దొరికాయని ఆయన చెప్పారు.

అయితే.. మహ్మద్ వాదనలను ఖండించేలా సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త వాదనలు లేవనెత్తింది. పురాతత్వ సర్వేపై ఇద్దరు హిందూ స్వతంత్ర పురాతత్వవేత్తలతో వక్ఫ్ బోర్డు విశ్లేషణ చేయించింది. వారు ఎన్నో ప్రశ్నలు సంధించారు. కానీ… వారు వామపక్ష ఆలోచనలతో అశాస్త్రీయ వాదనలు ఎత్తుకున్నారని కేకే మహ్మద్ వారి వాదనలను తోసిపుచ్చారు. అంతేకాదు… 10వ 12వ శతాబ్దం ఆ తర్వాత భారత్లో పర్యటించిన యాత్రికులు తమ పర్యటన వివరాల్లో అక్కడ హిందూ ఆలయం ఉందని చెప్పడానికి సంబందించిన ఆధారాలు సేకరించారు. విలియం ఫించ్ జోజఫ్ టైఫింథ్లర్ గురించి ప్రసావించిన కేకే మొహమ్మద్ వారితోపాటు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆయన దర్బారులోని చరిత్రకారుడు అబూ ఫఝల్ ఫార్సీలో రాసిన దర్బార్-నామా అంటే ఆయినా-ఎ-అక్బరీని ప్రస్తావిస్తూ వివాదాస్పద స్థలంలో శ్రీరాముడికి పూజలు చేసేవారని అందులో కూడా ఉందని తెలిపారు. ఇవన్నీ బలమైన ఆధారాలు అందించడంతో ఆ స్థలంలో హిందూ ఆలయంలో ఉండేదని నిర్ధారణయింది.

కాగా మహ్మద్ అయోధ్యలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ పలు హిందూ ఆలయాలను సంరక్షించి పునర్నిర్మించారు. మధ్యప్రదేశ్ మురైనా దగ్గర ఉన్న బటేశ్వర్లో గుజర్ రాజుల కాలం నాటి ఆలయాల అవశేషాలను ఆయన అన్వేషించారు. వాటిలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న 200 నిర్మాణాల్లో 70 ఆలయాలను పునర్నిర్మించారు. చత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్లోని దంతెవాడ దగ్గర బార్సూర్ సామ్లూర్ ఆలయాలను కూడా ఆయన సంరక్షించారు. ఆయన సేవలకు ప్రభుత్వం 2019లో కేకే మొహమ్మద్ను పద్మశ్రీతో గౌరవించింది. మహ్మద్ ‘‘నేను భారతీయుడిని’’ పేరుతో రాసిన ఆత్మకథలో ఇవన్నీ ప్రస్తావించారు.
Please Read Disclaimer