Templates by BIGtheme NET
Home >> Telugu News >> MP Gorantla Madhav Controversy: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో ఊహించని ట్విస్ట్..

MP Gorantla Madhav Controversy: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో ఊహించని ట్విస్ట్..


MP Gorantla Madhav Controversy: గత కొద్దిరోజులుగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. వీడియో వైరల్ గా మారిన తరువాత తెలుగుదేశం పార్టీ స్వరం పెంచింది. మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారం అధికార వైసీపీకి ప్రతిబంధకంగా మారింది. ఎలా ముందుకెళ్లాలో తెలియక పాలక పక్షం సతమతమవుతోంది. అయితే ఈ వీడియోకానీ నిజమని తేలితే ఎంపీ మాధవ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కీలక సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. అటు తరువాత ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎటువంటి ప్రకటనలు జారీ కాలేదు. మరోవైపు అనుకూల మీడియా ద్వారా మాత్రం సస్పెన్ష్ వేటు వేస్తారని ప్రచారం కల్పించిన వైసీపీ తరువాత ఎందుకో వెనక్కి తగ్గింది. అయితే ఈ వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్. న్యూడ్ వీడియోలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి పెట్టారంటూ వైసీపీ మహిళా నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు టీడీపీ, జనసేన నాయకులపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియా యాక్టివిస్ట్..
ఇప్పటివరకూ కేవలం ఎంపీ మాధవ్ చుట్టూ వివాదం నడుస్తుండగా.. ఇప్పడు ఓ మహిళ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె పేరు కూడా బయటపడింది. కద్రి ప్రాంతానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనితారెడ్డి తన ఫొటోను మార్ఫింగ్ చేసి వీడియోలో పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు., చినికిచినికి గాలివానలా మారిన ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వివాదంలో ఇప్పుడు ఈ సరికొత్త గా మహిళ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. కొంతమంది టీడీపీ, జనసేన నాయకులే తన ఫొటోను మార్ఫింగ్ చేసి పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. ఐదుగురు వ్యక్తుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటానని.. వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటానని.. అది తట్టుకోలేకే తన ఫొటోను ఆ వీడియోలో వాడారని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను హైలెట్ చేస్తున్నందునే తనను టార్గెట్ చేశారని కూడా ఆమె చెబుతున్నారు.

యాక్షన్ లోకి ప్రభుత్వం?
సోషల్ మీడియా వేదికగా తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పోస్టింగులు, కామెంట్లు చేస్తున్నారని.. మానసికంగా ఎంతో వేదన చెందుతున్నానని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగే అవకాశముంది.ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ పాత్రపై అనుమానాలున్నాయి. తాజాగా జనసేన నేతలపై అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు రావడంతో శరవేగంగా దర్యాప్తు జరిగే అవకాశముంది. రాజకీయంగా డ్యామేజ్ జరగడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు రావడంతో సీరియస్ గా యాక్షనలోకి దిగే అవకాశముంది. ఫిర్యాదును ఆధారంగా చేసుకొని టీడీపీ, జనసేన నాయకులపై కేసుల నమోదుతో పాటు అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

డీజీపీకి లేఖ..
అయితే ఈ వ్యవహారం అటుంచితే అసలు ఆ వీడియో మార్ఫింగ్ అంటూ ఎంపీ మాధవ్ చెబుతున్నారు. జిమ్ చేస్తున్న వీడియో ఆధారంగా మార్పింగ్ చేశారని చెబుతున్నారు. అయితే అది మార్ఫింగా.. లేకుంటే నిజమేనా అన్నది కూడా ఇంతవరకూ స్పష్టత లేదు. అయితే విపక్షాలకు ఇదో ప్రచార అస్త్రంగా మాత్రం మారిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహార శైలిపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహిళా మంత్రి రోజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం వాసిరెడ్డి పద్మ స్పందించారు. కేసులో వాస్తవాలను వెల్లడించాలని డీజీపీ రాజేంద్రనాథ్ కు లేఖ రాశారు.