రనౌట్‌తో మొదలై.. రనౌట్‌తో ముగింపు? ధోనీ రిటైర్మెంట్‌పై కోహ్లి స్పందన..

0

వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియా.. కేవలం 45 నిమిషాల చెత్త ఆటతో సెమీస్‌లో బోల్తా కొట్టింది. ఆదిలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత ధోనీ, జడేజా భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. మ్యాచ్‌ను ముగిస్తారనుకున్న తరుణంలో జడేజా అవుటవడంతో.. తర్వాత ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వరల్డ్ కప్‌లో భారత్ ఆడే చివరి మ్యాచే.. ధోనీకి బ్లూ జెర్సీలో ఆఖరి మ్యాచ్ అని వార్తలొచ్చాయి. ధోనీ రిటైరవుతాడని ప్రచారం జరిగింది.

కానీ ధోనీ మాత్రం రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ధోనీ రిటైర్మెంట్ విషయమై ప్రెస్ మీట్‌లో కోహ్లిని ప్రశ్నించగా.. ఈ విషయంలో మహీ భాయ్ నాకే సమాచారం ఇవ్వలేదని విరాట్ తెలిపాడు. సెమీస్ మ్యాచ్‌లో జడ్డూ ఓ వైపు షాట్లు ఆడుతుంటే.. ధోనీ వికెట్ పడకుండా చూశాడన్న కోహ్లి… మహీ ఔటైతే.. మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరనే విషయాన్ని గుర్తు చేశాడు. ఆఖర్లో వికెట్ల పతనాన్ని అడ్డుకుంటాడనే కారణంతోనే ధోనీని ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపించామన్నాడు. చివరి ఐదారు ఓవర్లలో ధోనీ బ్యాట్ ఝలిపిస్తాడు. అందుకే అతడు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడని కెప్టెన్ చెప్పాడు.

కాగా సోషల్ మీడియాలో మాత్రం ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగుతోంది. రనౌట్‌తో వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ధోనీ.. రనౌట్‌తోనే కెరీర్‌ను ముగిస్తున్నాడంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఎంఎస్ ధోనీ, జోగిందర్ శర్మ భారత జట్టులో అడుగుపెట్టారు. ఆ మ్యాచ్‌లోనూ ఒకే బంతిని ఎదుర్కొన్న ధోనీ.. రనౌటయ్యాడు.
Please Read Disclaimer