సీఎం జగన్ కు తొలి లేఖాస్త్రం సంధించిన ముద్రగడ

0

కాపుల రిజర్వేషన్ కు సంబంధించి గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వరుస లేఖాస్త్రాలు సంధించిన కాపు ఉద్యమ నేత ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి తొలి లేఖాస్త్రం సంధించారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం కోటా కుదరదన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముద్రగడ ఆయనకు బహిరంగ లేఖ రాశారు.

కోర్టులో కేసులు ఉన్నందున రిజర్వేషన్ల అమలు కుదరదని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా పత్రికల్లో చదివానని అయితే ఎక్కడ స్టే ఇచ్చారో అసెంబ్లీలోగానీ మీడియాతోగానీ చెప్పి ఉంటే సంతోషించేవాడినని ఆయన తన లేఖలో అన్నారు. నిజంగా కోర్టులో స్టే ఉంటే మళ్లీ ఎన్నికల వరకు నోటికి ప్లాస్టర్ వేసుకుంటామని ముద్రగడ స్పష్టం చేశారు. మీరు ఇస్తానన్న రూ.2 వేల కోట్లకు ఆశపడి ఓట్లు వేశారని భావిస్తున్నారా? అని సీఎంను ఆయన ప్రశ్నించారు. మా జాతి బానిసలుగా బతకాలని మీ అభిప్రాయమా? అంటూ పదునైన పదజాలంతో ఆయన జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అగ్రవర్ణపేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని గుర్తు చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని కానీ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక హోం మంత్రులు లోక్ సభలో హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారని ముద్రగడ తన లేఖలో గుర్తు చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ముద్రగడ కాపు రిజర్వేషన్లపై ఆయనకు లేఖలు రాశారు. ఈ అంశంపై అప్పట్లో కత్తిపూడిలో ఆయన సమావేశం నిర్వహించతలపెట్టగా అప్పటి ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడంతో నన్ను చంపేయండి అంటూ ముద్రగడ సీరియస్గా స్పందించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా కాపుల విషయంలో అన్యాయం చేస్తోందంటూ ఆయన మండిపడుతున్నారు.
Please Read Disclaimer