ప్చ్.. ముకేశ్ అంబానీ కల నెరవేరలేదు.. తండ్రి కోసం త్యాగం!

0

ముకేశ్ అంబానీ.. దాదాపు అందరికీ తెలిసే ఉంటారు. పరిచయం అవసరంలేని దేశీ దిగ్గజ వ్యాపారవేత్త. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. దేశంలోనే అత్యంత సంపన్నుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్. ఇది ఒక్కటే కాకుండా ఎన్నో కంపెనీలను విజయపథంలో నడిపిస్తున్నారు.

ఇంతటి శక్తిసామర్థ్యాలు కలిగిన ముకేశ్ అంబానీ చిన్నప్పుడు టీచర్ అవ్వాలని కలలు కన్నారు. కానీ అది జరగలేదు. అయితేనేం దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగారు. ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న అంబానీ జన్మించారు. అదికూడా మన దేశంలో కాదు యెమెన్‌లో. ముకేశ్ అంబానీ తల్లిదండ్రులు తర్వాతి సంవత్సరమే భారత్‌కు తిరిగి వచ్చేశారు.

అంబానీ కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. 1980లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి కూడా వెళ్లారు. అయితే తర్వాత వాళ్ల నాన్న ఆయనను వెనక్కి పిలిపించారు. యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఆదేశించారు.

అంబానీ అప్పడప్పుడు తన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తనను ప్రభావితం చేసిన విలియన్ ఎఫ్ షార్పే, మన్మోహన్ శర్మ వంటి ప్రొఫెసర్ల గురించి అప్పడప్పుడు చెబుతూనే ఉంటారు. ముకేశ్ అంబానీ తన తండ్రి రిలయన్స్ సామ్రాజ్యంలోకి తీసుకురాకముందు యూనివర్సిటీలో టీచర్ అవ్వాలని భావించేవారు. ఇది కుదరకపోతే ప్రపంచ బ్యాంకులో పనిచేయాలని అనుకునేవారు. ఈ విషయాలను అంబానీ ఒక పబ్లిక్ మీటింగ్‌లో వెల్లడించారు.

‘నా భార్య (నీతా) టీచర్‌గా ఉన్నారు. ఈమె నాకు ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోమని చెప్పారు. మా ఇద్దరికీ ఎడ్యుకేషన్ విభాగం అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో దీనికే అధిక ప్రాధాన్యమిస్తాం. ఇది మాకు ఎంతో సంతోషానిస్తుంది’ అని ముకేశ్ అంబానీ గతంలో ఒక సమావేశంలో తెలిపారు.

ఇకపోతే ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా ఉంది. అలాగే ఈయన రిలయన్స్ రిటైల్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నారు. రిలయన్స్ జియోతో సంచనలం క్రియేట్ చేశారు. మరోవైపు రిలయన్స్ జియో గిగాఫైబర్‌ను లాంచ్ చేశారు.
Please Read Disclaimer