ఫేస్‌బుక్ పరిచయం.. ప్రియురాలిని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి..

0

మరో ఫేస్‌బుక్ విషాదాంతమయ్యిది. ఏడాదిగా ప్రేమించుకున్న జంట.. చిన్న, చిన్న విభేదాలతో మనస్పర్థలు పెంచుకుంది. దీంతో ప్రియుడు ప్రియురాలిని నమ్మించి గెస్ట్‌హౌస్‌కు పిలిపించాడు. ఆమెను అతి దారుణంగా చంపి.. తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి ప్రాణాలు తీసే ముందు అతడి వింత ప్రవర్తన.. హత్యకు కారణాలు తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారట.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అరుణ్‌కుమార్ గుప్తా ఇంటర్ పూర్తి చేసి తన తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. ముంబైకి చెందిన ప్రతిమ ఓ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఈ ఇద్దరికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఇద్దరూ రోజూ సరదాగా మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న లవ్ స్టోరీలో చిన్న వివాదం మొదలయ్యింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గుప్తా తాను వారణాసి వెళుతున్నానని చెప్పాడు. వారణాసి వెళ్లినట్లే వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా ముంబై రైలెక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకొని.. ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌లో రూమ్ తీసుకున్నారు. అదే రోజు రాత్రి 9.30 గంటల సమయంలో గెస్ట్‌హౌస్ సిబ్బంది ఈ జంట ఉన్న గది తలుపు తట్టగా ఎవరూ స్పందించ లేదు. అనుమానంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.

పోలీసులు వెంటనే గెస్ట్‌హౌస్‌కు చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూశారు. గదిలో ప్రతిమ బెడ్‌పై రక్తపు మడుగులు పడి ఉండగా.. ప్రియుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వెళాడుతున్నాడు. వెంటనే మృతదేహాలను పోస్ట్‌‌మార్టమ్‌కు పంపి గెస్ట్‌హౌస్ సిబ్బందిని ఆరా తీశారు. ఈ జంట గదిలో దిగిన తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో ఓసారి మంచినీళ్ల కోసం పిలిచినట్లు వారు తెలిపారు.

ఘటనా స్థలంలో పరిస్థితిని బట్టి అరుణ్ గుప్తా తన చేతిని కోసుకొని.. ప్రియురాలి నుదిటిన బొట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ఆమెను కిరాతకంగా చంపి.. అతడు కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు.. గుప్తా కొద్దిరోజులుగా ప్రతిమను తన ఊరికి రమ్మని ఒత్తిడి చేస్తున్నాడట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆమె తిరస్కరించడంతో.. కోపం పెంచుకొని చంపినట్లు అనుమానిస్తున్నారు.
Please Read Disclaimer