భూమిపై చంద్రుడి బిలం.. మహారాష్ట్రలోని ఈ గుండ్రని సరస్సు ఎలా ఏర్పడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0

ఈ విశ్వం అనేక గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాల సమూహం. వీటిలో అత్యంత భిన్నమైన గ్రహం మన భూగ్రహమే. భూమిపై ఉండే అద్భుతాలు బహుశా.. మరే గ్రహం మీద ఉండకపోవచ్చు. ఓ పక్క జలం, మరో పక్క భూమి.. భిన్న వాతావరణాలు ఈ భూమికే సొంతం. అందుకే, ఈ గ్రహం ఎప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. అయితే, భూమి మీద ఉండే కొన్ని అద్భుతాలను చూస్తే.. అవి ఎలా ఏర్పడ్డాయనే ఆశ్చర్యం కలుగుతుంది. మానవ సాధ్యం కాని ఆకృతులను చూస్తే ప్రకృతి ఎంత గొప్పదో అర్థమవుతోంది. మహారాష్ట్రలో గల ఈ గుండ్రని సరస్సును చూసినప్పుడు కూడా ఇదే భావన ఏర్పడుతుంది. చంద్రుడి మీద మాత్రమే కనిపించే ఈ బిలాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. భూమిపై కేవలం అగ్నిపర్వత బిలాలు మాత్రమే ఉన్నాయి. కానీ, చంద్రుడి బిలాన్ని పోలిన సరస్సులు ఎక్కడా లేవు. ఇది ప్రపంచంలోనే బసాల్టిక్‌ రాక్స్‌లో కనుగొన్న ఒకే ఒక్క బిలం సరస్సు. అందుకే దీన్ని జాతీయ భూ వారసత్వ స్మారక సరస్సు‌గా గుర్తించారు. అయితే, ఇది ఎప్పుడు? ఎలా ఏర్పడిందనేది స్పష్టత లేదు. ఇది దేవతలు కొలువైన ప్రాంతమని, ఈ సరస్సులోని నీటికి ఎన్నో శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. మరి, ఈ సరస్సు ప్రత్యేకత ఏమిటీ? ఇది ఎలా ఏర్పడిందో చూద్దాం.

భారత పురాణాల్లో..

ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించే చంద్రుడి బిలం సరస్సు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా లోనార్‌లో ఉంది. ఈ సరస్సు గురించి స్కంద, పద్మ పురాణాల్లో సైతం ప్రస్తావన ఉంది. ఈ చారిత్రక ప్రాంతాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు పాలించారు. ఇక్కడ ఎన్నో ఆలయాలు కొలువై ఉండేవి. అయితే, కాలక్రమేనా అవి బిలంలో నీటి అడుగుకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు మాత్రమే బయటకు కనిపిస్తాయి.

ఇదో అద్భుత సరస్సు..

సాధారణ యుగం 1600 సంవత్సరం నాటి ఓ చారిత్రక దస్త్రంలో ఈ సరస్సు గురించి ఆసక్తికర విషయాలు రాసి ఉన్నాయి. ‘‘ఈ పర్వతాలు.. అద్దాలు, సబ్బుల తయారీకి అవసరమైన ముడి సరుకును ఇస్తున్నాయి. వీటి ద్వారా రాజ్యానికి అవసరమైన రెవెన్యూను పొందవచ్చు. ఇది ఉప్పునీటి సరస్సయినా.. ఈ సరస్సు మధ్యలో, చివర్లో స్వచ్ఛమైన నీరు లభిస్తుంది’’ అని అందులో రాసి ఉంది.

ఆలయాలకు నెలవు..

ఈ సరస్సు ప్రాంతం ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందినట్లు అక్కడి పురాతన ఆలయాలను చూస్తే తెలుస్తోంది. వీటిలో చాలా ఆలయాలు శిథిల స్థితిలో ఉన్నాయి. గణేశమహేశ్వర ఆలయం పాక్షికంగా నీటిలో మునిగి ఉంది. మోతా మారుతి హనుమన్‌, దైత్య సూదనాలయం, వాగ్మహా దేవాలయం, కమలజదేవీ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి హనుమాన్ ఆలయంలో మూలమూర్తి ఒక అయస్కాంత శిల. అందుకే దీన్ని మోతా (అయస్కాంతం) మారుతి ఆలయం అంటారు. ఆ ఆలయం పక్కన అంబర్ సరస్సు ఉంది. ఇది కూడా బిలం సరస్సే. పెద్ద ఉల్క నుంచి విడిపోయిన ఓ చిన్న ఉల్క పక్కకు పడటం వల్ల ఇది ఏర్పడిందని అంటారు. ఇక్కడి లోనార్ ధార్ ఆలయాన్ని తప్పకుండా చూడాలి. ఈ ఆలయం పక్కనే ఉన్న సెలయేరులో నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే.

ఎలా ఏర్పడింది?

ఈ బిలం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు.. 50 వేల ఏళ్ల కిందట జరిగినట్లు చెప్పారు. 2010లో నిర్వహించిన స్టడీలో ఈ బిలం వయస్సు 5,70,000 నుంచి 47 వేల మధ్యలో ఉండవచ్చని అంచనా వేశారు. అప్పట్లో ఉల్కాపాతం వల్ల ఈ బిలం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సరస్సు వ్యాసం 1.2 కిలోమీటర్లు. లోతు సుమారు 137 మీటర్లు. ఒకప్పుడు ఈ బిలం కొండలను తలపించేది. ప్రస్తుతం ఇది అతి పెద్ద గుండ్రని సరస్సులా కనిపిస్తోంది.

ఈ సరస్సులోని నీటిని పరీక్షించిన శాస్త్రవేత్తలు.. ఇందులో సోడియం క్లోరైడ్, కార్బోనేట్, ఫ్లోరైడ్ ఉన్నట్లు కనుగొన్నారు. నీటిలో ఆల్కలీన్ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సరస్సును సీతా నహనీ అని కూడా అంటారు. అంటే.. సీతా దేవి అక్కడ స్నానం చేశారని స్థానికుల విశ్వాసం. ఉల్కాపాతం జరిగిన తర్వాత అక్కడ భూమిపై 600 మీటర్ల గొయ్యి ఏర్పడిందని, అదే క్రమేనా సరస్సుగా మారిందని అంటారు. అయితే, ఇప్పటి వరకు ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఉల్కాపాతం వల్ల అంబర్, గణేష్ అనే రెండు బిలాలు ఏర్పడినట్లు చెబుతారు. వీటిలో అంబర్ సరస్సులో నీరు పూర్తిగా ఇంకిపోయింది.

చంద్రుడి బిలంతో పోలిక..

ఈ సరస్సును చూడటానికి చంద్రుడి బిలంలా ఉంటుంది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రుడిపై ఉన్నట్లే ఈ బిలంలో కూడా గాజు స్పటికం, సుద్ధ వంటివి ఈ బిలంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సరస్సులో కొన్ని రాళ్లు పైకి తేలుతుంటాయి. మరికొన్ని రాళ్లకైతే అయస్కాంత శక్తి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సరస్సు ప్రపంచంలోనే భిన్నమైన సరస్సుగా లోనార్ గుర్తింపు పొందింది. మీరెప్పుడైనా మహారాష్ట్ర వెళ్లినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. ఇది ఔరంగాబాద్‌కు 140 కి.మీ దూరంలో ఉంది.
Please Read Disclaimer