అండగా నేనున్నా.. క్యాన్సర్ బాధితురాలు స్వప్నకు ధైర్యం చెప్పిన బాలకృష్ణ

0

బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న అనంతపురం నగరానికి చెందిన స్వప్న అనే ఇంటర్ విద్యార్థిని గురించి తెలుసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రప్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వప్నకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న స్వప్నను బాలయ్య మంగళవారం పరామర్శించారు. స్వప్నతో కాసేపు సరదాగా మాట్లాడారు. భయపడాల్సింది ఏమీ లేదని, అండగా తానున్నానని స్వప్నకు ఆమె తల్లికి ధైర్యం చెప్పారు. స్వప్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బసవతారకం హాస్పిటల్‌కు నందమూరి బాలకృష్ణ మేనిజింగ్ ట్రస్టీ, చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

కాగా, అనంతపురం నగరంలోని సోమనాథనగర్‌లో నివాసముంటున్న వెంకట్రాముడు, అరుణ దంపతుల కుమార్తె స్వప్న బోన్ క్యానర్స్‌తో బాధపడుతోంది. వెంకట్రాముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కుమార్తెకు మెరుగైన చికిత్స అందించలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక, కుమార్తెను ఆ పరిస్థితిలో చూడలేక ఈ దంపతులు కుమిలిపోయేవారు.

అయితే, స్వప్న ధీనగాథపై పత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన బాలకృష్ణ స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే కూడా అయిన బాలయ్య.. జిల్లా అధికారుల ద్వారా స్వప్న గురించి ఆరా తీశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌస్‌మొయిద్దీన్, ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామిలను స్వప్న ఇంటికి పంపారు. బాలికతో, ఆమె తల్లి అరుణతో బాలకృష్ణ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. స్వప్నకు బసవతారకం హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్వప్నకు బాలకృష్ణ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. తానున్నానని ధైర్యం చెబుతున్నారు.
Please Read Disclaimer