ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం.. సూసైడ్ నోట్‌లో మంత్రి పేరు.. లోకేశ్ ట్వీట్!

0

మచిలీపట్నంలో ఆశా కార్యకర్తగా పని చేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరురాలు జయలక్ష్మి అత్మహత్యాయత్నం చేసింది. గత మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమె, ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని సంపాదించింది. అయితే, ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడటంతో ఆమె రెండు ఉద్యోగాలపై పలువురు ఫిర్యాదులు చేయడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు ఏదో ఓ ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించారు. దీంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె, ఆశా కార్యకర్తగా కొనసాగుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ ఉద్యోగం కూడా పోతుందని మనస్తాపం చెందిన జయలక్ష్మీ శనివారం మధ్యాహ్నం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సూసైడ్ నోట్‌ కూడా రాసిపెట్టింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మంత్రి పేర్ని నాని వేధింపుల వల్లే జయలక్ష్మీ ఆత్మహత్యాయత్నం చేశారని, మహిళా హోంమంత్రి ఉన్న మహిళలకు రక్షణే లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. జయలక్ష్మి రాసిన సూసైడ్ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేసిన లోకేశ్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘వైసీపీ మంత్రి పేర్ని నాని వేధింపులకు జయలక్ష్మిగారు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ? ఇదేనా రాజన్న రాజ్యం @ysjagan గారు ?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

‘ఈ ప్రభుత్వంలో ఆడదాని మీద ఇంత కక్ష కట్టారని, మంత్రి పేర్ని నాని, అంగన్వాడీ టీచర్ యేసు కుమారి, ఆశవర్కర్ వెంకటేశ్వరరావులు తనను బతకనివ్వకుండా టార్చర్ పెడుతున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం నుంచి తీయించారు. ఆశా వర్కర్‌గానూ పనిచేసుకోకుండా ఏడిపిస్తున్నారు.. నా లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాని’ అని జయలక్ష్మి తన సూసైడ్‌లో పేర్కొన్నారు.
Please Read Disclaimer