‘జగన్ గారూ.. సామాన్యులకు ఏంటీ ఈ-కేవైసీ కష్టాలు’

0

ఏపీలో రేషన్ కార్డులో పేరున్న వారు ఈ-కేవైసీ వివరాలను నమోదు చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మీసేవా కేంద్రాలు, పోస్టాఫీసులకు జనాలు క్యూలు కట్టారు.. దీంతో కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ముందు గడువు ఆగస్టు 25 వరకే ఉండటంతో ఆందోళన వ్యక్తమయ్యింది. రద్దీ కూడా పెరగడంతో ఆ గడువును సెప్టెంబర్ వరకు పొడిగించారు అధికారులు. 15 ఏళ్లలోపు పిల్లలకు రేషన్ కార్డ్ నమోదు గడువు సెప్టెంబర్ 15 వరకు.. 15 ఏళ్లపై బడిన వారు నమోదు చేసుకొనే గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు.

తాజాగా ఈ-కేవైసీ సమస్యపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలపై ట్వీట్ చేశారు. ‘పాదయాత్రలో అర్హులందరికీ సంక్షేమకార్యక్రమాలు, అధికారంలోకి వచ్చాకా ఆంక్షల పేరుతో కోతలు. జగన్ గారూ! సామాన్యుడికి ఏంటీ కష్టాలు? హామీల నుంచి పథకాలకు వచ్చేసరికే సగం మంది లబ్దిదారులను తీసేసారు. వాళ్ళనుంచి కూడా కొంతమందిని తీసేసే కుట్రతో రేషన్‌ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు’అని ఆరోపించారు.

‘పోనీ ఆ పనైనా సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణతో చేస్తున్నారా అంటే అదీ లేదు. పిల్లలు, మహిళలు 20 రోజులుగా ఎన్ని అవస్థలు పడుతున్నారో కనిపిస్తుందా? మీ ప్రతి నిర్ణయమూ ప్రజలకు శాపంగా మారుతోంది. ఏర్పాట్లేవీ చేయకుండా రూల్స్ మార్చేసి ప్రజలను ఎందుకిలా శిక్షిస్తున్నారు? ’అంటూ ప్రశ్నించారు.
Please Read Disclaimer