తారక్ పార్టీ ఎంట్రీపై పెదవి విప్పిన చినబాబు

0

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ పార్టీలో కీలకభూమిక పోషిస్తే బాగుంటుందన్న చర్చ పెరగటం.. ఇదే అంశాన్ని బాలయ్య రెండో అల్లుడు భరత్ ను అడగటం.. ఆయన చెప్పిన మాటలు కొంత క్లారిటీ ఇవ్వగా.. తాజాగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తారక్ టీడీపీ ఎంట్రీపై ఎలాంటి ఆలోచనలో ఉన్నారో తెలిసిపోయేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవటం.. పార్టీ నిరాశలో కూరుకుపోవటంతో పాటు.. పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూపు సారించిన నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని.. తారక్ ను పార్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్ పలు వేదికల మీద వినిపిస్తోంది.

2009 ఎన్నికల ప్రచారంలో కీలకభూమిక పోషించిన తారక్ ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి దూరంగా ఉన్న తారక్ ను పార్టీలోకి తెచ్చి కీలక భూమిక పోషించేలా ప్రయత్నాలు చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతానికి పార్టీ నేతల మధ్య జరిగే అంతర్గత సంభాషణల్లో ఈ అంశం తరచూ చర్చకు రావటం.. టీడీపీ నేతలు పలువురు పాజిటివ్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై తాజాగా మాజీ మంత్రి లోకేశ్ పెదవి విప్పారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ ఈ అంశంపై పార్టీకి చెందిన కీలక నేతలు పెదవి విప్పటం తొలిసారిగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీలోకి తారక్ ఎంట్రీపై మాట్లాడుతూ.. ఎవరైనా సరే.. పార్టీలోకి రావొచ్చని.. టీడీపీ ఏ వ్యక్తిగత వ్యక్తికి ప్రత్యేకత లేదన్నారు. తెలుగుదేశం భావజాలం నచ్చినోళ్లు ఎవరికి వారు స్వయంగా పార్టీలోకి రావొచ్చని.. తాను సైతం పార్టీలో సైనికుడిలా పని చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.

పార్టీకి దూరంగా తారక్ ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు బదులిచ్చిన లోకేశ్.. అది ఆయన వ్యక్తిగత నిర్ణయంగా చెప్పారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయాల్ని గౌరవించాలని.. టీడీపీ ఎప్పుడూ పార్టీ కోసం పని చేస్తానంటే అడ్డు చెప్పదన్నారు. మొత్తానికి పార్టీకి తారక్ దూరంగా ఉన్నారన్న సంకేతాల్ని ఇచ్చేయటంతో పాటు.. తామేమీ అతడ్ని దూరంగా ఉండమని చెప్పలేదని.. అదంతా ఆయన సొంత నిర్ణయంగా లోకేశ్ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల తారక్ తండ్రి.. తన బావమరిది అయిన హరికృష్ణ మొదటి వర్థంతి కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించటం తెలిసిందే. బాబు వెళ్లిన సమయంలో తారక్ ఉండటంతో.. ఆయనతో మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి.
Please Read Disclaimer