సీఎం జగన్‌.. కరకట్ట కమల్‌హాసన్‌.! డోసు పెంచిన నారా లోకేష్

0

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ డోసు పెంచారు. సీఎం వైఎస్ జగన్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బుధవారం ఆయన రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కృష్ణాయపాలెంలో గుండెపోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కృపానందం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతోనే కృపానందం గుండెపోటుతో మరణించారని లోకేష్ ఆరోపించారు.

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో పది మంది రైతులు చనిపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించరా అని లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్.. ఇప్పుడెందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

కృష్ణాయపాలెం, వెలగపూడిలో రైతుల రిలే నిరాహారదీక్షలకు లోకేష్ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి కారు ధ్వంసం ఘటనపై లోకేష్ స్పందించారు. దణ్ణం పెట్టి వేడుకుంటున్న రైతును ఎమ్మెల్యే పిన్నెల్లి గన్‌మెన్ తోసేశారని.. అందుకే తిరగబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. మన ముఖ్యమంత్రిని పొరుగు రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ చెప్తున్నది మూడు రాజధానులు కాదని.. మూడు ముక్కల రాజధానులని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతిపై జగన్ ప్రభుత్వం దిగి వచ్చేవరకూ పోరాడదామన్నారు. రైతులతో కలిసి పోరాడేందుకే తాను వచ్చానని లోకేష్ చెప్పారు. ఒక్కసారి మాట తప్పి.. మడమ తిప్పిన వ్యక్తి ఇక తిప్పుతూనే ఉంటాడంటూ సెటైర్లు వేశారు.

ఇప్పుడు అమరావతికి చేసిన అన్యాయమే రేపు జగన్ విశాఖకు, కర్నూల్‌కి కూడా చేస్తారని విమర్శించారు. అమరావతి రైతుల గోడు కరకట్ట కమలహాసన్‌కి ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. ఈ ఆంబోతు ప్రభుత్వాన్ని భరించేందుకు ప్రజలకు చాలా ఓర్పు కావాలని.. అమరావతి కోసం పోరాడదామని పిలుపునిచ్చారు.
Please Read Disclaimer