జగన్ గారు చేస్తుంది అసత్య ప్రచారమని కేంద్రమంత్రే చెప్పారు

0

పీపీఏలపై విషయంలో కేంద్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పవర్ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం పెట్టుబడులపై పడుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ అవకతవకలు జరిగాయంటున్నారని.. కానీ ఎక్కడా ఆధారాలు లేవన్నారు ఆర్కే సింగ్. కేంద్రం 100 రోజుల నివేదికను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఏపీ పీపీఏల వ్యవహారంపై స్పందించారు.

తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి లోకేష్ ఘాటుగా స్పందించారు. ‘మంచి మనిషికో మాట అన్నారు… నిజమే కానీ మేము మంచి మనుషులం కాదు కదా అన్నట్టుంది వైసీపీ నేతల వాలకం. చంద్రబాబుగారి హయాంలో జరిగిన పీపీఏలలో అవకతవకలు చోటుచేసుకున్నాయని జగన్ గారు చేస్తున్నదంతా అసత్య ప్రచారమే అని స్వయంగా కేంద్రమంత్రిగారే చెప్పారు’అంటూ ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.

‘మీ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవన్నా వదలకుండా పీపీఏలను రద్దు చేయమని వైసీపీ నేతలు పదేపదే లేఖలతో వెళ్ళి కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నారంట. ఇంత ఆరాటం ఎందుకు జగన్ గారూ? పాత పీపీఏలను రద్దుచేసి మీ సొంత పవర్ ప్రాజెక్టులకు లాభం తెచ్చేలా కొత్త ఒప్పందాలు చేసుకోవాలనే కదా?’అన్నారు.

‘మీ స్వార్థం కోసం రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారా? ఇది దేశద్రోహం కాదా? లేని అవినీతిని చంద్రబాబుగారికి అంటగట్టాలని చూస్తే ఇలాగే మీ నీచత్వం బయటపడుద్ది. ఇకనైనా ఈ అసత్య ప్రచారాలు మానుకోండి’అన్నారు లోకేష్.
Please Read Disclaimer