ఆ దేశ ఆర్థిక మంత్రి గా ఇన్ఫో నారాయణ మూర్తి అల్లుడు?

0

రవి ఆస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం పవర్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చరిత్ర పుస్తకాలు చదివితే తెల్లోడు ప్రపంచం మొత్తాన్ని ఎలా పాలించింది? వ్యాపారం పేరుతో దేశాలకు దేశాలకు వచ్చేసి.. అక్కడ పాగా వేసి.. ఆ దేశ ప్రజల స్వాతంత్య్రాన్ని దోచేసిన తీరును కథలు కథలుగా చదువుకున్నాం. ఇటీవల కాలం లో చాలానే సినిమాల్లో చూశాం. అలాంటి బ్రిటన్ దేశానికి ఇప్పుడు ఆర్థికమంత్రిగా భారత మూలాలున్న వ్యక్తి కానున్నారా? అంటే అవునన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడైన రిషి సునక్ బ్రిటన్ ఆర్థికమంత్రిగా నియమితులయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఆయన యార్క్ షైర్ లోని రిచ్ మాండ్ నుంచి విజయం సాధించారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఆయన పని తీరు పట్ల బ్రిటన్ ప్రధాని సంతోషంగా ఉన్న నేపథ్యంలో కీలకమైన దేశ ఆర్థిక మంత్రి పదవి ఆయన్ను వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం తాజా ఎన్నికల్లో టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొనటం ద్వారా కన్జర్వేటివ్ పార్టీ గెలుపు లో ఆయన పాత్ర కీలకమన్న అభిప్రాయం ఉంది.

నారాయణ మూర్తి అల్లుడైన 39 ఏళ్ల సునక్ కు భారత్ మూలాలు ఉన్నప్పటికి ఆయన పుట్టింది పెరిగింది ఇంగ్లండ్ లోని హాంప్ షైర్ కౌంటీలోనే. ఎన్నికల్లో వరుసగా మూడుసార్ల నుంచి ఎన్నికవుతున్న ఆయన థెరిసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదువుకునే సమయంలో నారాయణమూర్తి కుమార్తెతో ప్రేమలో పడ్డారు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన ప్రమాణస్వీకారాన్ని భగవద్గీత మీద ప్రమాణం చేయటం ద్వారా అంతర్జాతీయంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. వందల ఏళ్లు ఏలిన తెల్లోడి రాజ్యానికి సంబంధించిన కీలకమైన విత్త మంత్రిగా మనోడు పగ్గాలు చేపట్టటం జరిగితే అదో చరిత్రలా మిగులుతుందనటంలో సందేహం లేదు.
Please Read Disclaimer