Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీలో కొత్త ట్రెండ్.. కులాల క్వారంటైన్ సెంటర్లు

ఏపీలో కొత్త ట్రెండ్.. కులాల క్వారంటైన్ సెంటర్లు


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేళ.. ఊహించని ట్రెండ్ ఒకటి షురూ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తీరు ఏపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవటం.. వేలాది మంది బాధితులుగా మారిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఆశలు వదిలేసుకొని.. ఎవరికి వారు తమ కుల సంఘాలతో కలిసి వైద్య సేవలు అందించేకొత్త ట్రెండ్ కు తెర తీయటం హాట్ టాపిక్ గా మారింది.

కరోనా వేళ.. కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మానవత్వంతో అందరికి సాయ పడేలా ముందుకు రావాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఏ కులానికి చెందిన వారిని ఆ కులానికి చెందిన సంఘాలు సాయం చేసుకునే కొత్త అలవాటు ఒకటి మొదలైంది. రోగులకు వైద్య సాయం.. క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు ఇలా అన్ని కులాల వారీగా విడిపోయిన ఏర్పాట్లు చేసుకుంటున్న వైనం ఏపీలో అంతకంతకూ పెరిగిపోతోంది.

మామూలుగానే తెలంగాణలో పోలిస్తే..ఏపీలో కుల ప్రభావం చాలా ఎక్కువ. కరోనావేళ.. ఇది మరింత పెరిగేలా తాజా పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఈ జాఢ్యం మొదలైంది. రెడ్డి క్వారంటైన్ సెంటర్.. కాపు క్వారంటైన్ సెంటర్.. కమ్మ క్వారంటైన్ సెంటర్.. రాజు క్వారంటైన్ సెంటర్.. వైశ్య క్వారంటైన్ సెంటర్.. ఇలా బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు తమ కులానికి చెందిన వారికి ఏర్పాట్లు చేస్తున్నారు.

వాస్తవానికి ఈ ట్రెండ్ ఏపీలో స్టార్ట్ కాలేదని.. దీని మూలాలు ఉత్తరాదిన మొదలైనట్లుగా చెబుతున్నారు. ఉత్తరాదిలోని ఆర్థికంగా బలమైన వర్ణాలుగా చెప్పే అగర్వాల్స్.. జైన్స్.. ఇలా ఇతర వర్గాల వారు తమ కులానికి చెందిన వారికి సాయం చేసేందుకు వీలుగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. వీటితో పాటు.. తక్కువ ధరకే లభించేలా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు.. వైద్య సాయాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వం నుంచి అరకొర ఏర్పాట్లు ఉండటం.. ప్రైవేటుకు వెళితే.. జేబులు చిల్లులు పడే పరిస్థితి ఉండటంతో.. కులాల కాన్సెప్టుల్ని తెర మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఇవి పని చేయనప్పటికి.. వీలైనంతవరకు అనధికారికంగా.. వ్యక్తిగత సంబంధాలతో ఈ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవళ.. వీటి గురించి తెలీక.. ఇతర కులాల వారు వైద్య సాయం కోసం వస్తే.. బెడ్లు లేవని.. ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయానని.. ఇలా చెప్పి తప్పించుకుంటారని చెబుతున్నారు.

కరోనా లాంటి సంక్షోభ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలు కలిసి కట్టుగా వైరస్ ను ఎదుర్కోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఎవరికి వారుగా కులాల వారీగా చీలిపోవటం మంచిది కాదంటున్నారు. అయితే.. కుల సంఘాల వారి వాదన మరోలా ఉంది. అందరికి సాయం చేసే స్థాయి తమకు లేదని.. అందుకే.. కనీసం తమ కులానికి చెందిన వారికైనా సాయం చేయాలన్న ఉద్దేశమే తప్పించి.. కులతత్త్వాన్ని పెంచి పోషించటం తమ ఉద్దేశం కాదంటున్నారు. మొత్తంగా ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.