చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా..!?

0

చైనా శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. దానికి మహమ్మారిగా మారగల సామర్థ్యం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ జాతి వైరస్ పందుల్లో వస్తుంది. కానీ అది మనుషులకు కూడా వ్యాపించవచ్చు. ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకోగలదని, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుందని, మహమ్మారిగా కూడా మారవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పందుల నుంచి మనుషులకు వ్యాపించడానికి అవసరమైన అన్ని లక్షణాలూ ఈ వైరస్‌కు ఉన్నాయని, అందుకే, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “ఇది కొత్తరకం ఫ్లూ వైరస్ కాబట్టి, దీన్నుంచి కాపాడుకునే రోగనిరోధక శక్తి ప్రజల్లో తక్కువగా ఉంటుంది, లేదంటే అసలు ఉండకపోవచ్చు” అని వారు చెబుతున్నారు.

మహమ్మారిగా మారే ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు కరోనావైరస్‌ను నిర్మూలించే ప్రయత్నాల్లో ఉన్నా, కొత్త, ప్రమాదకరమైన ఈ ఇన్‌ఫ్లూయెంజా జాతి వైరస్ గురించి పాథాలజిస్టులు అప్రమత్తం అయ్యారు. 2009లో వెలుగులోకి వచ్చిన స్వైన్ ఫ్లూ మహమ్మారి అందరూ అనుకున్నంత ప్రమాదకరం కాలేదు. ఎందుకంటే అది అంతకు ముందు బయటపడిన చాలా వైరస్‌ల లాంటిదే. అందుకే ప్రజల్లో కూడా స్వైన్ ఫ్లూ వైరస్‌తో పోరాడగలిగే సామర్థ్యం ఏర్పడింది. అప్పుడు వచ్చిన ఆ వైరస్ పేరు A/H1N1pdm09. దాని వాక్సిన్‌ను ఇప్పుడు ఏటా ఫ్లూ వాక్సిన్‌గా ఇస్తున్నారు. చైనాలో తాజాగా గుర్తించిన ఫ్లూ వైరస్ 2009లో బయటపడిన స్వైన్ ఫ్లూ లాంటిదే. కానీ ఇది కొన్ని కొత్త మార్పులతో మళ్లీ బయటపడింది.

“ఇప్పటివరకూ ఇలాంటి వైరస్ వల్ల ఏ ప్రమాదం రాలేదు. కానీ కొత్త వైరస్‌ మీద ఒక కన్నేసి ఉంచాలి” అని ప్రొఫెసర్ కిన్-చౌ చాంగ్, ఆయన సహచరులు అంటున్నారు.

శ్వాసనాళంలో పెరుగుతుంది
G4 EA H1N1 అనే ఈ కొత్త వైరస్ మనుషుల శ్వాసనాళంలో పెరుగుతుందని, తన సంఖ్యను వృద్ధి చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనాలో పందుల పరిశ్రమల్లో పనిచేసేవారిలో ఇది వ్యాపిస్తుందనే ఆధారాలను వారు గుర్తించారు. ఇది సోకిన వారిని ప్రస్తుతం ఉన్న ఫ్లూ వాక్సిన్ కాపాడలేదు. కానీ, అవసరమైతే దీన్ని ఎదుర్కోడానికి ఆ వైరస్ సన్నద్ధం చేయగలదు. “ప్రస్తుతానికి కరోనా వైరస్ వల్ల మన దృష్టి ఎక్కడో ఉంది. కానీ కొత్త, ప్రమాదకరమైన ఈ వైరస్‌ నుంచి మన దృష్టి మళ్లించకూడదు” అని బ్రిటన్ నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కిన్-చౌ చాంగ్ బీబీసీతో అన్నారు.అయితే, “ఈ వైరస్ వల్ల ఇప్పటికిప్పుడు సమస్య లేదు. అలా అని దీనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు” అని వారు అంటున్నారు.

“పందుల్లో, వాటి ఆస్పత్రుల్లో పనిచేసేవారిలో ఈ వైరస్‌ను గుర్తించడానికి తక్షణం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి” అని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక లేఖ రాశారు. “కొత్త రోగాలకు కారణమయ్యే వైరస్‌ల ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందనే విషయాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. అడవి జంతువులతో పోలిస్తే, మనుషులకు దగ్గరగా ఉండే పెంపుడు జంతువులు ఈ వైరస్‌లకు ప్రధాన కారణం” అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వెటర్నరీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ జేమ్స్ వుడ్స్ అన్నారు.
Please Read Disclaimer